28, సెప్టెంబర్ 2010, మంగళవారం

దండన పాపం ఉపాధ్యాయుడిదేనా?


నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ రైట్స్ ఆదేశాలతో కొన్ని జిల్లాలలో బాల బాలికల హక్కులు పరిరక్షించేందుకు ప్రొటెక్షన్ సెల్స్ ఏర్పాటవుతున్నాయి .అలా ఏర్పాటయిన ఒక జిల్లాలోని పత్రికా ప్రకటనలను చూస్తే ఉపాధ్యాయులను విలన్స్ గా చూపించే ప్రయత్నం కనపడుతోంది ."గురువుల వేధింపులకు అడ్డు కట్ట " విద్యార్థులను కొట్టే టీచర్లకు దండన " దండనకే దండన ".వీటిని చూసినవారెవరైనా ఉపాధ్యాయులను గౌరవనీయ స్థానం నుండి రాక్షసుడి స్థానానికి బదిలీ అవకాశముంది .అయితే ప్రొటెక్షన్ సెల్ వద్ద్దనీ ,విద్యార్థులను భౌతికంగా దండించడం సబబనీ చెప్పడం ఉద్దేశ్యం కాదు .విద్యార్థులు దండనకు గురి కావడానికి కొందరు ఉపాధ్యాయులతో పాటు వ్యవస్థాగత ,సామాజిక కారణాలున్నాయనీ, వాటిని కూడా విశ్లేషించు కోవడం అవసరమనీ , తెలియజెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం .
               పిల్లలకై తమ హృదయాల్ని అంకితం చేసిన గిజుబాయి ,సుహోమ్లీన్స్కీ వంటి ఉపాధ్యాయులూ ,పిల్లల పెంపకం గురించి వ్రాసిన చలం వంటి తాత్వికులూ ,ఇంకా అనేక మంది దండన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్త పరిచారు .సమిష్టి బోధనా సిద్ధాంతాన్ని సోవియట్ రష్యాలో ఆచరించి చూపిన సుహోమ్లీన్స్కీ పిల్లల హృదయం ఎంత సున్నితమైనదో ఇలా చెబుతాడు.
                "పిల్లవాళ్ళు తేటగా ఉండే మనసులతో బాగా చదవాలనే మనః పూర్వకమైన కోరికతో బడికి వస్తారు.తమను సోమరులనీ మొద్దులనీ అనుకుంటారేమోననే ఆలోచనే వాళ్ళను బెదరగోట్టేస్తుంది.బాగా చదవాలనే ఆలోచన మంచిదే .పిల్లవాడి జీవితపు ఆలోచన మొత్తాల్లల సంతోష ప్రపంచాన్ని వెలిగించే కాంతి వంతమైన జ్యోతి అది .యీ జ్యోతి ఉపాధ్యాయుని దగ్గరకు అపరిమితమైన విశ్వాసం తో దుర్బలంగా రక్షణ లేకుండా వస్తుంది .ఆ ఉపాధ్యాయుడు పిల్లవాడి కోరికను గుర్తించక పోతే దానర్థం అతడు గానీ ఆమె గానీ భవిష్యత్ కాలాలపట్ల తగినంత గుర్తింపుతో లేరనే .పిల్లవాడి హృదయాన్ని అజాగ్రత్త స్పర్శ తో బాధపెట్టుకోవదానికీ ,నిర్లక్ష్యానికీ దారితీసే ఒక దూకుడు మాటతో ఆ జ్యోతిని తేలిగ్గా ఆర్పేయవచ్చు"
           పిల్లలకు అల్లరి చెయ్యాలని ఉండదు .పెద్ద వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళకేమీ సంతోషం లేదు .కానీ వాళ్లకి ప్రవర్తించ వలసిన మార్గం తెలీక ,ఎట్లా తమ శక్తుల్నిఅభివృద్ధి పర్చుకోవాలో అర్థంకాక ,పెద్దవాళ్ళ  ఆజ్ఞలూ ఇబ్బందులూ స్పష్టంకాకనే " పిల్లలు అల్లరి చేస్తారని చెబుతాడు చలం .
                            ఇటువంటి పిల్లలను దండించడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో క్రూరులుగా తయారవుతారనీ,పిరికి తనం తో బ్రతుకుతారనీ చలం అభిప్రాయము .  జనవిజ్ఞాన వేదిక వంటి అభ్యుదయ సంస్థలు ,ప్రముఖ విద్యావేత్తలతో పాటుగా విద్యాలయాల్లోని దండన సంస్కృతికి వ్యతిరేకంగా తరగతి గదుల్లో ప్రజాస్వామ్యం గురించి పోరాడుతున్నాయి .2000 వ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రజతోత్సవ మహాసభల్లో ప్రవేశ పెట్టిన "విద్యారంగం యు.టి.యఫ్ వైఖరి "అనే డాకుమెంట్ లో ఇలా చెప్పారు .
                  "మన బోధనా ధోరణి ,ఒక వైపు మన ప్రమాణాలకే గాక మరోవైపు డ్రాపౌట్సుకు సైతం కారణం అవుతోంది .అంతేగాదు బడులలో పిల్లల భద్రత,బోధనలో ఆహ్లాదం అనేవి ప్రజాస్వామిక సంస్కృతి లక్షణాలు .అదొక మహత్తర విలువగల అంశం .దీనికి తగ్గ ప్రాధాన్యత లేక పోవడం మనవ్యవస్థ లోని పెద్ద బలహీనత .దీనిపై జరగాల్సినంత పరిశోధన గానీ ఇతరులనుంచి స్వీకరించే సాంప్రదాయం గానీ లేక పోవడం విచారకరం ."
                 ఇలా దండన తో కూడిన అశాస్త్రీయమైన పాత విద్యావిధానాన్ని మార్చుకోవాలని సూచించింది ఆ పత్రం .దీన్ని బట్టి ఉపాధ్యాయ సంఘాలు అందునా అభ్యుదయ భావజాలంతో ఉన్న సంఘాలు దండనకు వ్యతిరేకమని తెలుస్తోంది .1996 లో రూపొందిన 'కోడె ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫర్ టీచర్స్ "ఉపాధ్యాయుడు విద్యార్థులతో సంబంధం అనే విభాగం లో పాఠశాల  క్రమ శిక్షణ అమలు జరిపే సందర్భంలో విద్యార్థుల యొక్క ప్రాధమిక మైన మానవ హుందాతనాన్ని గౌరవించాలి అని పేర్కొంది .
                 పైన పేర్కొన్న విషయాలన్నీ శ్రైన్వీ ఆచరించదగినవీ అని అంగీకరిస్తూనే ఉపాధ్యాయుడిని  విద్యార్థిపై భౌతిక దండనకు పాల్పడే విధంగా నడిపించే కారణాలను సమూలంగా విశ్లేషించాల్సి ఉంది .దీనిలో భాగంగా మూడు కారణాలను గుర్తించవచ్చు . 1 ) ఉపాధ్యాయుని వైపు నుండి కారణాలు  2 )ప్రభుత్వ లేక వ్యవస్థాగత కారణాలు . ౩) సామాజిక కారణాలు . 
           ఉపాధ్యాయుని వైపు నుండి కారణాలు 
                  ఇతర కారణాలు ప్రస్తావించుకునేముందు ఉపాధ్యాయుని వైపు నుండి దండనకు కారణమయ్యే విషయాలను చర్చించుకోవడం సముచితంగా ఉంటుంది .అంతేగాక కొద్దిపాటి నిగ్రహం తోనూ ,శిక్షణ తోనూ ,వీటిని తేలిగ్గానే తొలగించుకోవచ్చు .
                  కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగతంగానే తీవ్ర అసహనాన్ని కలిగిఉంటారు.వీరు విద్యార్థుల పట్ల తేలికగా కోపానికి గురవుతారు .దండనకు పాల్పడతారు .కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను దండిచకపోతే విద్య క్రమశిక్షణ అభివృద్ది కావని భావిస్తారు .మరికొంతమంది ఉపాధ్యాయులు తమకుటుంబ సమస్యల ప్రభావాన్ని తరగతి గదిలోకి తీసుకు రావడం వల్ల అక్కడ జరిగే చిన్నచిన్న పొరపాట్లు కూడా వారి కోపానికి ఆజ్యం పోయడం ,కొంతమంది విద్యార్థులు దండనకు గురికావడం జరుగుతుంది .అసౌకర్యంగా తరగతి గడీ , పాఠశాల లోని ఇతర సమస్యలు కూడా ఉపాధ్యాయుని మనసు పై నెగటివ్ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది .విద్యార్థుల స్థాయి తక్కువగా ఉండటం ,లేక వారి అల్లరితో క్లాసు కొనసాగించలేక పోవడం కూడా ఉపాధ్యాయుడిని విద్యార్థిని దండించే వైపుకు లాగుతుంది .ఉపాధ్యాయుడి సంసిద్ధతా లోపం ,ప్లాను ప్రకారం తరగతిని కొనసాగించ లేకపోవడం కూడా దండనవైపుకు దారి తీయవచ్చు .
             ఇటీవలి కాలంలో ఉపాధ్యాయునికీ ,విద్యార్థికీ మధ్య చాలా బలహీనమైన సంబంధాలు ఉంటున్నాయి ."ఇప్పటిలాగా గంటల పరిమితి లేదు కాబట్టి ఉపాధ్యాయుడు ప్రతీ విద్యార్థిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి అతనికి  బోధన సాగిస్తూ అదనపు సమయం  పాఠశాలలో గడిపేవారు .ఇంకా వెనుక బడిన వారికి ట్యూషన్లో ప్రధానంగా బోధించేవారు .అందుచే ఉపాధ్యాయుల విద్యార్థుల సంబంధాలు బాగా ఉండేవి ,శిక్షలు ,బెత్తాలతో కొట్టడం కూడా ఎక్కువగానే ఉండేది .ఆ శిక్షలకు తల్లి ,దండ్రుల ఆమోదం కూడా ఉండేది." అంటూ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు గా పని చేసిన శ్రీ .డీ .రామి రెడ్డి తన జ్ఞాపకాలను తెలియజేస్తారు . ప్రస్తుతం ఉపాధ్యాయునికి విద్యార్థిపై తగినంత ప్రేమ ఉండక పోవడం ,విద్యార్థికి ఉపాధ్యాయునిపై తగినంత గౌరవం ఉండక పోవడంతో దండనకు సంబందించిన దుష్ఫలితాలు అనేక రెట్లు ఎక్కువగా కనబడుతున్నాయి .తను ఊహించినట్లు గానే విద్యార్థి ప్రవర్తించడనే గ్రహింపు ఉపాధ్యాయునికి లేక పోవడం ,విద్యార్ధి కుటుంబ నేపథ్యం పై ఉపాధ్యాయునికి అవగాహన లేకపోవడంతో పాటు భౌతిక దండన ద్వారానే విద్యార్థిని సులభంగా అదుపులో ఉంచవచ్చనే భావనకూడా దండనకు కారణమౌవుతోంది.ఇవన్నీ ఉపాధ్యాయుడు వ్యక్తిగతంగానో,శిక్షణ ద్వారానో ,ప్రత్యేక అధ్యయనం ద్వారానో ,శాసనాల ద్వారానో సరిచేసుకోగలుగుతారు .
               ప్రభుత్వ లేక వ్యవస్థాగత కారణాలు 
            పాఠశాలలో తగినన్ని గదులు లేకపోవడం వల్ల వివిధ క్లాసులకు చెందిన పిల్లలను ఒకే గదిలో కూర్చో బెట్టడం ,సెక్షన్ లను క్లబ్ చేయడం ,అనివార్యంగా విద్యార్థుల క్రమశిక్షణారాహిత్యానికి దారి తీస్తుంది .వేరే గత్యంతరం లేని ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రజాస్వామ్యానికి బదులు నియంతృత్వాన్ని ఆశ్రయిస్తాడు .తరగతుల్ని కొనసాగించడానికి సులభ మార్గమైన దండనను ఎంచుకుంటాడు.ఉపాధ్యాయుల కొరతా,ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి లో ఉండే తీవ్ర వ్యత్యాసాలు ఇవే ఫలితాన్ని ఇస్తాయి .కొంతమంది ప్రధానోపాధ్యాయుల అశాస్త్రీయ దృక్పథం కూడా కొన్ని సార్లు ఉపాధ్యాయునిచేత విద్యార్థులను దండిపజేస్తుంది .ఇంతే గాక ఫలితాలకోసం ఉపాధ్యాయులను  పరుగులు పెట్టించే పదకాలూ ,అధికార్లూ ఎంతకూ తరగని సిలబస్ ,జ్ఞాపకముంచుకోవడం మాత్రమే నేర్చుకోవడంగా భావించే పరీక్షా పద్దతీ ఉపాధ్యాయుడిని    దండనా యజ్ఞానికి ఆయత్తం చేస్తుంది .విద్యార్థిని బలిపశువును చేస్తుంది .  పాఠశాలలో ప్రశాంత వాతావరణం లేకపోవడం తో పాటు శాస్త్రీయ పద్ధతి లో విద్యను  బోధించేందుకు అనువైన సౌకర్యాలు అనేక  పాఠశాలలలో ఉండవు .వీటన్నిటినీ సరిచేయటానికి ఇసుమంతైనా ప్రయత్నం చేయకపోగా దండన అనేది కేవలం ఉపాధ్యాయుని పాపమే అన్నట్లుగా అతనికోసం శిక్షణా కార్యక్రమాలు నడుపుతారు ,శిక్షలను ఖరారు చేస్తారు .ఉపాధ్యాయుడిని దండనకు ప్రేరేపించే వ్యవస్థా గత కారణాలు చాలా తీవ్రమైనవీ ,ఉపాధ్యాయుడిని నిస్సహాయుడిని చేసేవీనూ .వాటిని సరిదిద్ది చిన్నారుల పై కరుణ చూపాల్సిన ప్రభుత్వం శిశు హింసను ప్రోత్సహించే దోషిగా మారుతోంది .
సామాజిక కారణాలు 
           మన పిల్లలను ఇంట్లోనూ , పాఠశాలలోనూ దండించడానికి మూలాలు మన సమాజంలోనే ఉన్నాయనడం అతిశయోక్తి కాదు .మన సమాజం భూస్వామ్య ,పెట్టుబడి దారీ వ్యవస్థల మిశ్రమం . ముఖ్యంగా కుటుంబ విషయానికి వస్తే ఇంకా భూస్వామ్య భావజాలమైన యాజమాన్య ఆధిపత్య ధోరణి ని వదిలించుకోలేదు ఇప్పటికీ బిడ్డను భవిష్యత్ పౌరునిగాకంటే స్వంత ఆస్తి గా భావించే లక్షణమే ఎక్కువ .తన ఆస్తికి  వారసుడిని తన అదుపాజ్ఞలలో ఉంచుకునే క్రమంలో కుటుంబం పిల్లలపై హింసను అధికంగానే ఉపయోగిస్తుంది ."మొక్కైవంగనిది మానై వంగుతుందా "అంటూ వారు శారీరకంగా ఎదగక బలహీనంగా ఉండే వయస్సులోనే ఈ హింస జరుగుతున్నట్లు మహిళా శిశు అభి వృద్ధి శాఖ విడుదల చేసిన రిపోర్ట్ తెలియజేస్తోంది.5 నుండి12 సంవత్సరాల పిల్లలే ఎక్కువ భౌతిక వేధింపులకు గురియగుచున్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో 63 .94 % పిల్లలపై భౌతిక వేధింపులు జరుగుతున్నాయి.ఈ నివేదిక ప్రకారం మొత్తం 47.15 % పిల్లలు దూషణలకు గురిఅవుతూంటే దానిలో తల్లుల వాటా 44.03% అనీ ,తండ్రుల వాటా 35.35% అనీ సహోదరులది 8.80 అనీ ఇతరులది 11.21%అనీ తేలుతోంది.ఇతరులహింసలో పెద్ద వాటా ఉపాధ్యాయులదే కావచ్చు.భార్యా భర్తల మధ్య సఖ్యత లేక పోతే పిల్లల పై హింస మరింత అధికమవుతుంది .
         మరో కోణం నుంచి చూస్తే పెట్టుబడి దారీ వ్యవస్థ కూడా హింసకు మద్ధతిచ్చేదే.ఈ వ్యవస్థ స్వభావం కూడా పాలకులు పాలితులుగానే వ్యక్తులను చూస్తుంది .క్రమశిక్షణా రాహిత్యానికి శిక్షలను నిర్దేశిస్తుంది.పాలితుల పట్ల ఈ దండన తీవ్రంగా ఉండేట్లు  జాగ్రత్త పడుతుంది. సమాజంలో ఉండే ఈ అంశాలు క్రమశిక్షణ కోసం విద్యాభివృద్ధి కోసం విద్యార్థిని భౌతికంగా దండించ వచ్చనే ధోరణికి మద్దతు నిస్తోంది . చాలా మంది ఉపాధ్యాయులకు గానీ ,సమాజంలో ఇతర వ్యక్తులకు గానీ ,దండనకు గురయ్యే విద్యార్థికి గానీ ఇందులో ఏమాత్రం పొరపాటు కనబడదు.ఇటువంటి సమాజంలో ఒకానొక భాగస్వామి అయిన  పాఠశాల,ఉపాధ్యాయుడూ ఆ దారినే అనుసరించడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు . ఇంత కథ దండనకుంటే  పలానా ఫోన్ నెంబరుకు డయల్ చేసి మిమ్మల్ని దూషించినా లేదా భౌతికంగా దండించినా ఉపాధ్యాయుడి పేరు చెప్పండి వెంటనే మేము అతడిని శిక్షిస్తాము అనే ప్రకటనల చాటున అసలు దోషులయిన ప్రభుత్వమూ సమాజమూ దాక్కోవాలని చూస్తున్నాయి . ఇదే సందర్భంలో ప్రాధమిక దశ నుండీ  పాఠశాలలలో ఉపాద్యాయులు మన;పూర్వకంగా దండనను నిషేదించాలి.ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి.ప్రజాస్వామ్యాన్ని తరగతి గదిలో వికసించేలా చూడాలి .తద్వారా ఆత్మగౌరవం ,దైర్యం ,సౌభాతృత్వం ,కలిగిన పౌరుల్ని సమాజానికి అందించాలి.సమాజంలో హింసను తగ్గించి ,నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి దేశాన్ని మళ్ళించే అవకాశం ఆ విధంగానే ఉంటుంది .అంతేగాక నిర్దోషి గా పోజు పెడుతున్న ప్రభుత్వాన్ని నిలదీసి అవసరమైతే పోరాడి విద్యార్థుల ఆహ్లాదకర బాల్యాన్ని నష్టపెడుతున్న వ్యవస్థాగత కారణాలను నిర్మూలించే ప్రయత్నం ఉపాధ్యాయులు తప్పక చేయాలి .మనం తప్ప ఈ విషయాన్ని ఎవరూ ఇంత లోతుగా పరిశీలించరు.ఎక్కడైనా పొరపాటు జరిగి వ్యవహారం శృతి మించితే మాత్రం మీడియా దాన్ని నాటకీయంగా వెలుగు లోకి తేవడం తో పాటు , అందరు ఉపాధ్యాయులూ అంతేననే వాతావరణం తేవడంలో ఏమాత్రం వెనుకాడదు.

1 కామెంట్‌:


Blog designed by Gopi varaprasad Rao,Cell:9247171248