27, సెప్టెంబర్ 2010, సోమవారం

              బుద్ధుడు నవ్వాడు

బుద్ధుడు నవ్వాడు
అసహజ సంకీర్ణ సంగీత విభావరిలో
బ్రహ్మచారికి ముదిమిలోనూ తప్పని
ముదితలపోరు చూసి
        బుద్ధుడు పకపకా నవ్వాడు
మౌడ్యానికి మారణాయుధాన్నందించిన
భారత రత్నాన్ని చూసీ
లీకేజీయే లేని ప్రోఖ్రాన్ పరీక్షలను చూసీ
                 బుద్ధుడు విస్మయంతో నవ్వాడు
హస్తిన పట్టాభి రాముడు భారతిని
అణు జ్వాలల్లో ప్రాయోపవేశం చేయమంటే
మాత కోకకు కూతల్తో నిప్పంటిస్తూన్న 
తోకలేని కోతుల్ని చూసి
               బుద్ధుడు బాధతో  నవ్వాడు
వికృత విస్పోటపు రవాలు
సద్దు మనుగుతూంటే
ఆకలి కేకలూ ....పాలందని పాపల ఏడుపూ
తీవ్ర మవడం చూసి 
              బుద్ధుడు జాలిగా నవ్వాడు 
వందిమాగధుల వందన సమర్పణ పై 
విజయం సాధిస్తున్న 
శాంతి కపోతాల సామర్థ్యాన్ని చూసి 
           బుద్ధుడు మనసారా నవ్వాడు .

ఈ కవితను ప్రోఖ్రాన్ అణు పరీక్షలు జరిపినప్పుడు రాసాను .బుద్ధుడు నవ్వాడు అనేది ఆనాడు ఉపయోగించిన కోడ్ .

1 కామెంట్‌:

  1. గోపాల కృష్ణ గారూ! మీ బ్లాగును అభిమానంతో నేను చూచే అవకాశాన్ని కల్పించినందుకు ముందుగామీకు నా ధన్యవాదములు.
    అద్భుతమైన భావాల్లి చక్కగా భావకవితలో అందించిన మీకు అభినందనలు.

    రిప్లయితొలగించండి


Blog designed by Gopi varaprasad Rao,Cell:9247171248