25, అక్టోబర్ 2010, సోమవారం

          అభ్యుదయ కవి రాంషా(కవిత్వ సమీక్ష)
(రాంషా కవిత్వం గురించీ సాహిత్యంగురించిన వ్యాసాలూ చాలా తక్కువ .ఈవ్యాసం 'సాహిత్య  ప్రస్థానం 'పత్రికలో ప్రచురించారు)
రాంషా పేరు వినగానే అనేక మంది సాహితీ మిత్రులకు మనో లైంగిక వైజ్ఞానిక మాస పత్రిక అభిసారిక సంపాదకునిగానే స్మృతిపథంలో మెదులుతారు .ఆయన సృష్టించిన ఇతర సాహితీ సంపద గానీ , చేసిన సాహితీ సేవ గానీ ,గుర్తుకు రాదు . ఇది ఒక రకంగా ఆయన సాహిత్యం పట్ల జరిగిన అన్యాయంగానే పేర్కొనాలి.ప్రణయ కళకు సంబంధించిన అనేక పుస్తకాలతోపాటుగా,'కామేశ్వరి కథ' వంటి కొన్ని నవలలు ,ఆయన భాషలో చెప్పాలంటే ఖండ కథలు ,మనో వైజ్ఞానిక గ్రంథాలు ,కళ- సారస్వతానికి సంబంధించిన కొన్ని వ్యాసాలూ వారు రచించారు .తనదైన శైలిలో సాంఖ్యం ,వైశేషికం,యోగం ,న్యాయం ,వంటి దర్శనాలకు వ్యాఖ్యానం వ్రాసారు.వీటితో పాటు అభ్యుదయ పంథాలో గురజాడ అడుగు జాడల్లో సాగే ఆయన కవిత్వాన్ని 'అనంతం' అనే కవితా సంకలనంలో చూడవచ్చు.
           ఆయన  జీవిత విశేషాలు కొన్ని తెలుసుకున్న మీదట మనకు రాంషా కవిత్వం లేదా రచనల్లోని అభ్యుదయాంశ నేపథ్యం అవగతమవుతుంది.ఆయన హేతువాద తత్వాన్ని అంచనా కట్టడం సులభమవుతుంది .
        ' రాంషా ' అనే కలం పేరుతో ప్రఖ్యాతులైన దర్బా వెంకట రామశాస్త్రి కాకి నాడ సమీపంలోని వెట్లపాలెం గ్రామంలో 1924 జూలై 30 న జన్మించారు .కాకినాడ లోని పి.ఆర్ .కాలేజీలో చదివేటప్పుడు ఆయనకు అభ్యుదయ కవి సోమసుందర్ తో పరిచయం ఏర్పడింది.అప్పటి వరకు సాంప్రదాయ వాదిగా ఉన్న రాంషా మార్క్సిస్ట్ గా మారాడు.పిటాపురం లో తాలూకా కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజర్ గా సోమసుందర్ వ్యవహరిస్తున్నప్పుడు,రాంషా ఆఫీసు కార్యదర్శి గా సేవలందించారు.ఆరోజుల్లో జమీందారీ వ్యతిరేక పోరాటాలు ,చెరువు శిఖం భూముల ఆక్రమణ ,మున్సిపల్ కార్మికుల సమస్యలు ,కూలి రేట్ల పోరాటాలు పార్టీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండేవి .భూస్వాముల దాడులనుండి అప్రమత్తంగా ఉండవలసి వచ్చేది .ఒకసారి దుండగులు పట్టణ కార్యాలయాన్ని తగుల బెట్టగా ఆ దాడినుండి రాంషా తప్పించుకోగాలిగారు.తండ్రి మరణం తర్వాత పిటాపురం పార్టీ బాధ్యతలు వదిలి పెట్టి ,స్వస్థలం సామర్లకోట చేరి,స్థానిక పార్టీ కార్యకలాపాల్లోనూ,సాహిత్య ఉద్యమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు .రాజమండ్రిలో జరిగిన అభ్యుదయ రచయితల మహాసభల్లో ప్రతినిధి గా పాల్గొన్నారు .పెద్దాపురం ఈస్త్రియానిక్స్ కళా కేళి థియేటర్ స్థాపించి నాటక ప్రదర్శనలను ఇస్తుండే వారు .కాకి నాడ లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీల్లో 'కుళ్ళు సరుకు' అనే ప్రభోదాత్మక నాటకం ప్రదర్శించి రాంషా ఉత్తమ నట పురస్కారం పొందారు .కాలేజీ లో చదివే రోజుల్లోనే 'శిలాప్రతిమ' అనే పేరుతో అహల్య కథను నాటికగా వ్రాసి అభ్యుదయ కవి మిత్రుడు సోమసుందర్ కు అంకిత మిచ్చారు .
                  కమ్యూనిస్ట్ పార్టీ నిషేధం ,అభ్యుదయ పత్రిక పై నిషేధం విధించిన తర్వాత పార్టీ ప్రత్యక్ష కార్యక్రమాలు విరమించి ,సాహిత్యం ద్వారా ఆశయాలను ప్రచారం చేయాలని భావించారు.అభ్యుదయ సాహిత్యాన్ని 'కళ కేళి ' ప్రచురణ'సంస్థ ద్వారా ప్రచురించారు .మొదటి గా ఆరుద్ర 'త్వమేవాహం'బయటికి తీసుకు వచ్చారు.మంచి ప్రచారం వచ్చింది .తరువాత సోమసుందర్ 'వజ్రాయుధం'ప్రచురించారు .వజ్రాయుధం సంకలనం లో ఆనాటి నిజాం ప్రభుత్వాన్ని  వ్యతిరేకించే గేయాలున్నాయి.ఆనాటి  ఆంధ్రలోని ఫుదాల్ వ్యవస్థను వ్యతిరేకించేవి,శ్రామికులపై ప్రభుత్వ దమనకాండను నిరసించే కవితలున్నాయి.ఆనాటి మద్రాసు ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది .ప్రచురణ కర్త రాంషా  పై, అవంతి ముద్రణాలయం మహీధర రామ్మోహన్ రావు పై కేసులు బనాయించింది.రాంషా ఇంటిపై దాడి చేసి వజ్రాయుధం ప్రతులను జప్తు చేసారు.అరెస్టు కు ప్రయత్నం చేసారు .ఈ సందర్భంగా పట్టణంలో ఉద్రిక్తత వల్ల పోలీసులు వెనక్కి తగ్గారు .ఆ తరువాత కూడా రాంషా అభ్యుదయ సాహిత్య ప్రచురణ కొనసాగించారు .తెలంగాణా పోరాట విరమణ అనంతరం కమ్యునిస్టు పార్టీలో నెలకొన్న సైద్దాంతిక విభేదాలు ఆయనను గందర గోళానికి గురి చేసాయి .ఆ సమయంలో ధనికొండ హనుమంత రావు కొంతకాలం నడిపి వదలి వేసిన 'అభిసారిక' పత్రికను పునః ప్రారంభించారు.అభిసారిక ఆంధ్రదేశంలోని తొలి లైంగిక విజ్ఞాన మాస పత్రికగా వారి చేతుల్లోనే ప్రఖ్యాతి పొందింది.
                 అంతటి శాస్త్రీయ దృక్పథంతో రాంషా ఆ పత్రికను నడిపారు .అనేక కుటుంబాలలో నెలకొన్న లైంగిక సమస్యలను తన భార్య శిరీషతో కలసి పరిష్కరించి వారి కుటుంబాలలో వెలుగులు నింపారు .ఈనాడు అధిక ప్రాచుర్యం పొందిన కౌన్సిలింగ్ పద్ధతిని ఆయన ఆనాడే భార్యా భర్తల లైంగిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించి విజయం సాధించారు.
                 రాంషా తమ సాహిత్య సేవలో అనేక మంది ప్రముఖుల కావ్యాలను వెలువరించడంతోపాటు తాను స్వయంగా అనేక కథలను,చిన్న నవలలను ,ప్రణయ కళకు సంబంధించిన వైజ్ఞానిక గ్రంధాలను వ్రాసారు .వీరి రచనలు ఏవైనా వ్యవహారిక భాషలో స్పష్టంగానూ ,వైజ్ఞానిక దృష్టితోనూ ,పురోగామి దృక్పథం తోనూ ఉంటాయి .కళల గురించీ,ఇతర సాహిత్యం గురించీ రాంషా కు చాలా స్పష్టమైన అభ్యుదయ వైఖరి ఉందని వారి కథల గురించీ ,కళల గురించీ ,వ్రాసిన వ్యాసాల్లో తేట పరుస్తారు.ఆనాటి అభ్యుదయ ఉద్యమ ప్రభావం వీరిపై ప్రబలంగా ఉంది.
                వీరి కవిత్వ సంకలనం 'అనంతం 'లోని కవితలు 1944 నుండి 1954 వరకు వ్రాయబడ్డాయి .ఈ కవితల్లో గిడుగు వారి వ్యవహారిక భాషా చైతన్యం కనబడుతుంది.రాంషాది చాలా సరళమైన శైలి .చక్కని భావుకతతో బాటు ఆదర్శంలో కందుకూరిని అనుసరిస్తారు .కొన్ని కవితలను గమనించి నప్పుడు సునిశితమైన పరిశీలన వీరి సొంతం అనిపిస్తుంది.అనేక చోట్ల శ్రీ శ్రీ వలె కొత్త విషయాలను చెప్పడమో ,కొత్తగా చూపడమోకనిపిస్తుంది .కానీ శ్రీశ్రీ కవిత్వంలో ఉండే సమాస భూయిష్టత మచ్చుకైనా ఉండదు .ముఖ్యంగా కవిత్వంలో గురజాడ వారి కథాత్మక పద్దతికి సరైన వారసునిగా రాంషా ఉంటారు .
                'అనంతం 'కవితా సంపుటిని ఆయన మూడు భాగాలుగా విడదీస్తారు.సాయం సంధ్య,అర్ధ రాత్రి ,ఉదయ సంధ్య అంటూ ఈ మూడు భాగాలుగా విభజించడం ఆయన సంపాదకత్వం వహించి ముద్రించిన అన్ని కావ్యాలలోనూ పాటించారు .ఆరుద్ర 'త్వమేవాహం 'సోమసుందర్ 'వజ్రాయుధం',అనిశెట్టి 'ఆగ్నివీణ',శశాంక 'నయాజమానా'రెంటాల 'సర్పయాగం''సంఘర్షణ'లను ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.బహుశా అది ఆనాటి సాంప్రదాయం కావచ్చు.శ్రీశ్రీ 'మహాప్రస్థానం'దీనికొక మినహాయింపు.
                 ప్రకృతికి సంబంధించిన రాంషా పరిశీలన అనుభూతులు చాలా హృద్యంగా ఉంటాయి .'గౌతమి'అనే కవితలో వేగంగా ప్రవహించే గోదావరిని చూసి కానరాని గోదావరి లోతు నీడలను చూసి కవులు పాడేందుకు వీలుగా నెమ్మదిగా వెళ్ళమంటాడు .
                                      "లోలోన కానరాని లోతు నీడలను 
                                         అమృతము చిలికించు ఆర్ద్ర గాత్రాల 
                                         పాడనీ పాడనీ పదిమంది కవుల 
                                                  ఓదివ్య గౌతమీ ఓ భవ్య గంగ 
                                                  పారకే పారకే పరువులన్ వారి"
               'సీతాకోక చిలుక' కవితలో కవి దాని అందంతోపాటు గొంగళి పురుగులనుండి సీతాకోక చిలుక రావడం ఆశ్చర్యంగా ప్రకటిస్తాడు .రాంషా ఈ కవితలో తన సృజనాత్మకతనూ ,వైజ్ఞానిక దృష్టినీ ఇలా మేలవిస్తాడు.
                                          "నీ మొదటి రోత రూపున్ 
                                            కాలాన విడిచి పెట్టే
                                            విపరీత సృష్టి స్నిగ్ధా 
                                            ............................
                                            నావంటి దు:ఖితులలో 
                                           చైతన్య మూర్తులంతా 
                                          నీవలెనె అవతరించన్...
            పువ్వులంటే రాంషా కు చాలా ఇష్టం వలె తోస్తుంది.అవి కలిగించే మధుర భావాలు మానవత్వాన్ని నిలుపుతాయనే ఆశను ప్రకటిస్తాడు.'కుసుమ లాస్యం' అనే కవితలో.సంధ్యా సమయంలో చీకట్లు ముదురుతున్న వేళ రాంషా తన సుకుమారమైన భావాలనూ,చిక్కనైన భావుకతనూ ప్రదర్శిస్తాడు.
                                         "అపుడే నా మనసులో 
                                          భావాల దొంతరలు 
                                         మొగాడు తలపులలోన 
                                         నర్తించి నర్తించి 
                                          నాలోన లోలోన 
                                         విరిసినవి కురిసినవి 
                                        మసక చీకటి మూయ 
                                        ముసుగులో మగతగా 
                                        జిగిసోన కురియుచూ 
                                        మనసార చవులూర 
                                         గరుడ వర్ధన సతులు 
                                         పకపకా నవ్వినవి"
             ఈ కవిత చదివిన తరువాత ఎవరికైనా కనుల ముందు ఒక సుందర దృశ్యం ఆవిష్కృత మౌతుంది .
             పూవుల్లాగానే రాంషా కు పిల్లలంటే అపరిమితమైన అనురాగం.చిన్న పిల్లలు,చిరునవ్వులు,స్త్రీలు,పువ్వులు లేక పోతే ఈ జగత్తుకు సౌందర్యం ఉండదేమో అని సందేహం ప్రకటిస్తాడు."అనుక్షణం దు:ఖ భూయిష్టమైన ఈ లౌకిక జగత్తులో అప్పుడు పుట్టిన బిడ్డకన్నాఆనంద దాయి ఏది?" అంటాడు రాంషా .అటువంటి బిడ్డలు గర్భశోకాన్ని కలిగిస్తే ?
             "కాల పరిధి పై జారి పడితిరా"  ఒక నిర్ణీత కాలం వరకే ఉండటానికి వచ్చారా అని అర్ధం కావచ్చు ఈ ప్రయోగానికి ."క్షణత్ ప్రభలుగావెలిగి పోదురా "    అంటారు ఈ కవితలోనే ,మెరుపును 'క్షణత్ప్రభ' అనే ప్రయోగం సరికొత్తగా కనబడుతుంది.'బాలల్లారా' కవితలో  అనుభూతులు అద్భుతంగా కురుస్తాయి.శ్రీశ్రీ శైశవగీతి వంటి నడక తో సాగే ఈ కవిత ఆద్యంతమూ మనోహరంగా ఉంటుంది .
                                           "కృత్రిమ మెరుగని పూవుల్లారా 
                                             కన్నులు విప్పని కన్డుల్లారా 
                                             గతియించిన ఓ చిటిక వెలుగులో 
                                             మెరసి మెరసి చిరునవ్వులు నవ్వే 
                                            సిగ్గుపడే నాపాపల్లారా పూపల్లారా 
                                            కాల పరిధిపై జారి పడితిరా 
                                            ........................................
                                            ప్రకృతిలోనే కృత్రిమ తత్వం 
                                            ఊరించును మీ వలపులు జల్లీ 
                                            కవ్వించును మీ పోలిక చూపీ 
                                            అంతలోనె ఇటె పోగొట్టును మము 
                                           క్షణత్ప్రభలుగా వెలిగి పోదురా 
                                            కన్నుల హరివిల్లుంచి పోదురా 
                                           గడియో అర గడియో ఆనందాబ్ధిని 
                                           ఓలలాడించిటె మాయమౌదురా
                                           ఇంద్రధనుస్సలె ఈల పాటవలె 
                                            .............................................
               పుత్రశోకం మీకు తెలియదు .అందులో నరకముంటుంది.అందుకే అస్సలు పుట్టకండీ అంటాడు కవి తీవ్రమైన విషాదాలను గుర్తుచేస్తూ.
               ప్రేమా ,జాలీ ,శాంతీ,దాన్తీ కోరుతూ దేవునికి మొక్కే మనుషులకు చిత్రమైన జవాబిస్తాడు రాంషా 'దేవుడు ' కవితలో .                                          "మనుషులు చేసిన దేవుని చుట్టూ 
                                              దౌర్భాగ్యంగా దురదృష్టంలో 
                                              ప్రేమా జాలీ శాంతీ దాంతీ
                                             కావాలంటూ దండాలిడుడురు 
                                            ..............................................
                                            ప్రేమా జాలీ శాంతీ దాంతీ 
                                             ఎక్కడ ఉండునొ  అక్కడే దేవుడు 
          ఈకవితను చదివితే గురజాడ వారి "మనిషి"కవిత 
                                          "  మనిషి చేసిన రాయి రాప్పకి 
                                            మహిమ గలదని సాగి మొక్కుతు
                                           మనుషులంటే రాయి రాప్పల
                                            కన్న కనిష్టం "             
          గుర్తుకొస్తుంది .ఈ రెంటిలో విషయపరమైన పోలిక ఉంటుంది .
              శ్రీ శ్రీ తన పరిణామ క్రమంలో నూతన వస్తువును ఎంచుకునే దశలో వ్రాసిన 'సుప్తాస్థికలు' కవితలో భూమి అడుగున ఉన్న మానవుని ఎముకల గురించిన ఊహలుంటాయి .
                                     "  ఆ మనుష్యాస్థికలు నిద్రలో మునింగి 
                                      సంచరించును భైరవ స్వప్నవీధి
                                       అవిచలించును తమ చర్మకవచ మెపుడొ  
                                       బ్రతికిన దినాల తలపోత బరువు చేత "
              ఇదే రకమైన వస్తువుతో 'సుధా పరీక్ష'కవిత వ్రాసాడు రాంషా .అయితే పోలికతో పాటు,భిన్నత్వమూ గోచరిస్తుంది .మృత్యు దేవత భూమి మీదకు వస్తే మరణించిన వ్యక్తి అస్థికలు తన గత కాలపు వెలుగులు పైలోకంలో ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తాయి .ఇదొక చిత్రమైన ఊహ .
                                  "   .............................
                                    నా బోసి నోటిపై 
                                    చిలుకరించిన చిందు 
                                    ఒలుక బోసిన వెలుగు 
                                    చిట్టి నాచిరునవ్వు   
                                   చెప్పవే చెప్పవే 
                                  చూచినావో లేదొ"
        శ్రీ శ్రీ 'ఉన్మాది 'కవితలో పిచ్చివాడి దీన స్థితిని వర్ణిస్తే రాంషా తన 'రాజ రాజు 'కవితలో అంధ బిచ్చగాడి స్థితిని మరొక పద్ధతి లో వర్ణిస్తాడు చూడండి .
                               శాద్వలమ్ముల చాలులోన
                               తాళ వృక్షపు తతుల ఛాయా
                               రాజ రాజి రాజ్యమేలాడు 
                               ఆ అంధ భిక్షువు .........
     ఆ అంధ భిక్షువు ఎవరో కాదు ,ఒక నాడు రాజ రాజుగా గడిపి ,పేదగా మారిపోయిన ఆంధ్ర రైతు .
    రాంషా 'మధుర స్మృతులు 'కవిత భావ కవిత్వపు ధోరణి లో ,ఆశు కవితా పద్ధతి లో ఉన్నా ఒక దేశ ద్రిమ్మరి లేక సంచార జాతి పిల్లను కధానాయికగా తీసుకోవడంలో విశిష్టత కనబడుతుంది.
            'మద్రాసు పర్యటన ' అనే కవితలో ఒక బ్రహ్మ రాక్షసి మద్రాసు నగరాన్ని సందర్శించి ఆనాటి సామాజిక పరిస్థితులను, ప్రభుత్వ పాలన లోని వపరీత్యాలను పరిశీలించడాన్నితీవ్రమైన వ్యంగ్యంతో ఆవిష్కరిస్తాడు రాంషా .
                             "దేశ రక్షణ పేరుతో వీరాగ్ర గణ్యుల
                             చేతులకు సంకెళ్ళు వేసి 
                              జైలులో శిక్షించు విధమునకు
                             బ్రహ్మ రాక్షసి ఆత్మ పొంగెను 
                             నరక మందున జైలు జీవిత
                             మెట్లుపెంపు పడంగ వలెనో
                             అడిగితే బాగుండు ననుకొని "
       ఈ పంక్తుల్లో కమ్యూనిస్టు వీరుల గురించీ ప్రస్తావిస్తాడు కవి .
       ఇలా క్రమంగా సుకుమారమైన భావాలనుండి ప్రయాణం కొనసాగిస్తూ రాజ్యంపై విమర్శలోకి చేరుకుంటాడు రాంషా .కందుకూరి మరణించి నప్పుడు వ్రాసిన ఎలిజీలో  ఆయనను స్నేహ పాత్రునిగా  అభివర్ణిస్తాడు .
                         "స్నేహ పాత్ర ఔచిత్యం 
                           ఎవని యందు కలిగిందో 
                           అట్టి జీవి చల్లారుట
                           జాలి కంటి నీటి కణం 
                          రాలదగిన సమయస్మ్రుతి
                          ఘనుడయ్యా కందుకూరి "
'   అరుణ తార పొడిచింది ' కవితలో ఫ్యూడల్ అధికారపు ప్రతీకగా ఉన్న పూల పల్లకినీ ,రాజ భవనాన్ని ,సిమ్హాసనాన్నీ,న్యాయాధికారినీ "ఇంకానా ఇకపై సాగదంటూ"హెచ్చరిస్తాడు .ప్రజలు రాజ్యాదికారులను కూలదోసి రాజులౌతారని చెబుతాడు .
                        "  కులాల,తెగలన్ ,జాతుల త్రెంపీ
                          పరుశురాములై రాజుల త్రోసీ 
                          ఆటను కట్టే ,ప్రజాస్వాములై 
                          భూక్షేత్రం పండిస్తారు ."
    ఇలా తన అభ్యుదయ భావజాలాన్ని ప్రకటిస్తూ తాను ఈలోకంలో పాపాత్ములని భావించే కర్షకులకూ,కూలీలకూ ,బానిసలకూ కవిని నేనే నని సగర్వంగా తెలియజేస్తాడు రాంషా 'సంజాయిషీ 'అనే కవితలో.
                    "రాంషా తన కొద్దిపాటి కవితల్లో తన ప్రతిభను బహుముఖాలుగా చాటడం అద్భుతంగా ఉంటుంది.ఈ శ్రామిక పక్షపాతి అయిన కవి రాంషా సాహిత్యాన్ని విమర్శకులు పరామర్శించి సాహితీ ప్రపంచంలో తగిన గౌరవం కల్పించాల్సి ఉంది.
                                      ........ సమాప్తం ............


                                                                  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి


Blog designed by Gopi varaprasad Rao,Cell:9247171248