13, నవంబర్ 2010, శనివారం

పొసెసివ్ నేచర్ 
నా 
నాది 
నాతోనే ఉండాలనీ
నీ నవ్వుల సీతాకోక చిలుకలు నా తోటలోనే మురియాలనే 
అనాది భావాన్ని అంతం చేసాననుకున్నా 
అది అణిగి మణిగి నాలోనే ఉందని 
తెలుసుకోలేక పోయా 
ఒక వ్యతిరేక పవనం
నా ఎముకల్ని కొట్టినప్పుడో 
నా తలపుల్ని తట్టి నప్పుడో 
బయట పడ్డట్టుంది ,గమనించలేదు 
తల తిప్పి లోకం వైపు చూస్తున్నావు నువ్వు 
లోకంవైపు నుండి తల తిప్పి నీ వైపు చూస్తున్నాను నేను 
ఒక పలకరింపు కోసం ఒక చూపు కోసం 
ఎదురు చూడ్డం ఇటీవల నాకు కొత్త 
చిరునవ్వుతో స్ఫూర్తి పొంది 
ప్రపంచాన్ని గెలుద్దామనుకున్నా
ఆయుధాల్ని సమకూర్చలేని గతం 
యుద్దాల్ని జయించలేని మనోగతం 
వెక్కిరిస్తున్నట్లుంది,దిక్కరిస్తున్నట్లుంది 
పరాయి వాళ్ళతో కొలతలు వేస్తుంటే 
పరాయినవుతాననే భయం గుండెల్లో ఉందేమో?
అడుగుల కొలతల్లో అంగుళాల్లోకీ
వేగంలో సాగలేని తనానికీ 
జారిపోతాననే సంశయం ఉందేమో ?
ఆత్మ విశ్వాసం నుండి న్యూనతా లోయల్లోకి
కూలిపోతాననే అందోళనేమో?
మధురమైన ఊహలు మృగతృష్ణ లౌతాయని 
తల్లడిల్లిందేమో హృదయం 
భద్రత లేదని బ్రద్దలయ్యిందేమో మనసు 
స్నేహాన్ని అధికారంతో అడిలించాలేమని 
ఉక్రోషంతో ఆక్రోశంలా కొత్త వేషంలో 
కత్తుల్ని విసిరిందనుకుంటా?
ఏంటా ధ్వని ? నాదా? మనిషిదా?
మగాడిదా?మృగాడిదా?
చెవులకు కంపరం పుట్టిస్తోంది 
తనువును జలదరింప జేస్తోంది 
ఆత్మ ప్రకంపన అపస్వరాల నేపథ్యం ఇస్తోంది 
భయం వేస్తోంది ,దు:ఖం పెల్లుబుకుతోంది 
స్నేహమా నీకెలా ఉందో?నాకిలానే ఉంది 
ఆపెయ్యాలి ,అంతం చెయ్యాలి ఎలా ?
తెలుసు ,బాధ్యతా బరువూ నాదే
తెలియదు ,నా ఒక్కడి వల్ల అవుతుందో?లేదొ?

2, నవంబర్ 2010, మంగళవారం

                    దోమ
చంపినాను నిన్ను బాది బాది 
వాడినాను మందులు వందలాది 
ఎక్కడ గరచినావు ఇట్టి కుట్టు విద్య 
భళిరే కరాటే గూడ చూడ వట్టి మిథ్య 
            జంతులన్నిట మనుజులె గొప్పవారు 
            వాని గొప్ప నీముందు సొక్కి పారు 
ఏమి వేగము నీది 
రామభాణము రీతి 
 చూచినంతనె కుట్టి 
మాయమౌదువు అట్టె
          కండ్ల నిండుగ నిదుర 
          కుట్టి నంతనె చెదురు 
         కలత నిదురగూడ
        సంగీతమున బెదురు
కోపము వలదమ్మ 
రాగ మెందుకె బొమ్మ 
దోమ భామా నన్ను 
                వదలవమ్మ 

25, అక్టోబర్ 2010, సోమవారం

          అభ్యుదయ కవి రాంషా(కవిత్వ సమీక్ష)
(రాంషా కవిత్వం గురించీ సాహిత్యంగురించిన వ్యాసాలూ చాలా తక్కువ .ఈవ్యాసం 'సాహిత్య  ప్రస్థానం 'పత్రికలో ప్రచురించారు)
రాంషా పేరు వినగానే అనేక మంది సాహితీ మిత్రులకు మనో లైంగిక వైజ్ఞానిక మాస పత్రిక అభిసారిక సంపాదకునిగానే స్మృతిపథంలో మెదులుతారు .ఆయన సృష్టించిన ఇతర సాహితీ సంపద గానీ , చేసిన సాహితీ సేవ గానీ ,గుర్తుకు రాదు . ఇది ఒక రకంగా ఆయన సాహిత్యం పట్ల జరిగిన అన్యాయంగానే పేర్కొనాలి.ప్రణయ కళకు సంబంధించిన అనేక పుస్తకాలతోపాటుగా,'కామేశ్వరి కథ' వంటి కొన్ని నవలలు ,ఆయన భాషలో చెప్పాలంటే ఖండ కథలు ,మనో వైజ్ఞానిక గ్రంథాలు ,కళ- సారస్వతానికి సంబంధించిన కొన్ని వ్యాసాలూ వారు రచించారు .తనదైన శైలిలో సాంఖ్యం ,వైశేషికం,యోగం ,న్యాయం ,వంటి దర్శనాలకు వ్యాఖ్యానం వ్రాసారు.వీటితో పాటు అభ్యుదయ పంథాలో గురజాడ అడుగు జాడల్లో సాగే ఆయన కవిత్వాన్ని 'అనంతం' అనే కవితా సంకలనంలో చూడవచ్చు.
           ఆయన  జీవిత విశేషాలు కొన్ని తెలుసుకున్న మీదట మనకు రాంషా కవిత్వం లేదా రచనల్లోని అభ్యుదయాంశ నేపథ్యం అవగతమవుతుంది.ఆయన హేతువాద తత్వాన్ని అంచనా కట్టడం సులభమవుతుంది .
        ' రాంషా ' అనే కలం పేరుతో ప్రఖ్యాతులైన దర్బా వెంకట రామశాస్త్రి కాకి నాడ సమీపంలోని వెట్లపాలెం గ్రామంలో 1924 జూలై 30 న జన్మించారు .కాకినాడ లోని పి.ఆర్ .కాలేజీలో చదివేటప్పుడు ఆయనకు అభ్యుదయ కవి సోమసుందర్ తో పరిచయం ఏర్పడింది.అప్పటి వరకు సాంప్రదాయ వాదిగా ఉన్న రాంషా మార్క్సిస్ట్ గా మారాడు.పిటాపురం లో తాలూకా కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజర్ గా సోమసుందర్ వ్యవహరిస్తున్నప్పుడు,రాంషా ఆఫీసు కార్యదర్శి గా సేవలందించారు.ఆరోజుల్లో జమీందారీ వ్యతిరేక పోరాటాలు ,చెరువు శిఖం భూముల ఆక్రమణ ,మున్సిపల్ కార్మికుల సమస్యలు ,కూలి రేట్ల పోరాటాలు పార్టీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండేవి .భూస్వాముల దాడులనుండి అప్రమత్తంగా ఉండవలసి వచ్చేది .ఒకసారి దుండగులు పట్టణ కార్యాలయాన్ని తగుల బెట్టగా ఆ దాడినుండి రాంషా తప్పించుకోగాలిగారు.తండ్రి మరణం తర్వాత పిటాపురం పార్టీ బాధ్యతలు వదిలి పెట్టి ,స్వస్థలం సామర్లకోట చేరి,స్థానిక పార్టీ కార్యకలాపాల్లోనూ,సాహిత్య ఉద్యమాల్లోనూ పాల్గొంటూ వచ్చారు .రాజమండ్రిలో జరిగిన అభ్యుదయ రచయితల మహాసభల్లో ప్రతినిధి గా పాల్గొన్నారు .పెద్దాపురం ఈస్త్రియానిక్స్ కళా కేళి థియేటర్ స్థాపించి నాటక ప్రదర్శనలను ఇస్తుండే వారు .కాకి నాడ లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీల్లో 'కుళ్ళు సరుకు' అనే ప్రభోదాత్మక నాటకం ప్రదర్శించి రాంషా ఉత్తమ నట పురస్కారం పొందారు .కాలేజీ లో చదివే రోజుల్లోనే 'శిలాప్రతిమ' అనే పేరుతో అహల్య కథను నాటికగా వ్రాసి అభ్యుదయ కవి మిత్రుడు సోమసుందర్ కు అంకిత మిచ్చారు .
                  కమ్యూనిస్ట్ పార్టీ నిషేధం ,అభ్యుదయ పత్రిక పై నిషేధం విధించిన తర్వాత పార్టీ ప్రత్యక్ష కార్యక్రమాలు విరమించి ,సాహిత్యం ద్వారా ఆశయాలను ప్రచారం చేయాలని భావించారు.అభ్యుదయ సాహిత్యాన్ని 'కళ కేళి ' ప్రచురణ'సంస్థ ద్వారా ప్రచురించారు .మొదటి గా ఆరుద్ర 'త్వమేవాహం'బయటికి తీసుకు వచ్చారు.మంచి ప్రచారం వచ్చింది .తరువాత సోమసుందర్ 'వజ్రాయుధం'ప్రచురించారు .వజ్రాయుధం సంకలనం లో ఆనాటి నిజాం ప్రభుత్వాన్ని  వ్యతిరేకించే గేయాలున్నాయి.ఆనాటి  ఆంధ్రలోని ఫుదాల్ వ్యవస్థను వ్యతిరేకించేవి,శ్రామికులపై ప్రభుత్వ దమనకాండను నిరసించే కవితలున్నాయి.ఆనాటి మద్రాసు ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది .ప్రచురణ కర్త రాంషా  పై, అవంతి ముద్రణాలయం మహీధర రామ్మోహన్ రావు పై కేసులు బనాయించింది.రాంషా ఇంటిపై దాడి చేసి వజ్రాయుధం ప్రతులను జప్తు చేసారు.అరెస్టు కు ప్రయత్నం చేసారు .ఈ సందర్భంగా పట్టణంలో ఉద్రిక్తత వల్ల పోలీసులు వెనక్కి తగ్గారు .ఆ తరువాత కూడా రాంషా అభ్యుదయ సాహిత్య ప్రచురణ కొనసాగించారు .తెలంగాణా పోరాట విరమణ అనంతరం కమ్యునిస్టు పార్టీలో నెలకొన్న సైద్దాంతిక విభేదాలు ఆయనను గందర గోళానికి గురి చేసాయి .ఆ సమయంలో ధనికొండ హనుమంత రావు కొంతకాలం నడిపి వదలి వేసిన 'అభిసారిక' పత్రికను పునః ప్రారంభించారు.అభిసారిక ఆంధ్రదేశంలోని తొలి లైంగిక విజ్ఞాన మాస పత్రికగా వారి చేతుల్లోనే ప్రఖ్యాతి పొందింది.
                 అంతటి శాస్త్రీయ దృక్పథంతో రాంషా ఆ పత్రికను నడిపారు .అనేక కుటుంబాలలో నెలకొన్న లైంగిక సమస్యలను తన భార్య శిరీషతో కలసి పరిష్కరించి వారి కుటుంబాలలో వెలుగులు నింపారు .ఈనాడు అధిక ప్రాచుర్యం పొందిన కౌన్సిలింగ్ పద్ధతిని ఆయన ఆనాడే భార్యా భర్తల లైంగిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించి విజయం సాధించారు.
                 రాంషా తమ సాహిత్య సేవలో అనేక మంది ప్రముఖుల కావ్యాలను వెలువరించడంతోపాటు తాను స్వయంగా అనేక కథలను,చిన్న నవలలను ,ప్రణయ కళకు సంబంధించిన వైజ్ఞానిక గ్రంధాలను వ్రాసారు .వీరి రచనలు ఏవైనా వ్యవహారిక భాషలో స్పష్టంగానూ ,వైజ్ఞానిక దృష్టితోనూ ,పురోగామి దృక్పథం తోనూ ఉంటాయి .కళల గురించీ,ఇతర సాహిత్యం గురించీ రాంషా కు చాలా స్పష్టమైన అభ్యుదయ వైఖరి ఉందని వారి కథల గురించీ ,కళల గురించీ ,వ్రాసిన వ్యాసాల్లో తేట పరుస్తారు.ఆనాటి అభ్యుదయ ఉద్యమ ప్రభావం వీరిపై ప్రబలంగా ఉంది.
                వీరి కవిత్వ సంకలనం 'అనంతం 'లోని కవితలు 1944 నుండి 1954 వరకు వ్రాయబడ్డాయి .ఈ కవితల్లో గిడుగు వారి వ్యవహారిక భాషా చైతన్యం కనబడుతుంది.రాంషాది చాలా సరళమైన శైలి .చక్కని భావుకతతో బాటు ఆదర్శంలో కందుకూరిని అనుసరిస్తారు .కొన్ని కవితలను గమనించి నప్పుడు సునిశితమైన పరిశీలన వీరి సొంతం అనిపిస్తుంది.అనేక చోట్ల శ్రీ శ్రీ వలె కొత్త విషయాలను చెప్పడమో ,కొత్తగా చూపడమోకనిపిస్తుంది .కానీ శ్రీశ్రీ కవిత్వంలో ఉండే సమాస భూయిష్టత మచ్చుకైనా ఉండదు .ముఖ్యంగా కవిత్వంలో గురజాడ వారి కథాత్మక పద్దతికి సరైన వారసునిగా రాంషా ఉంటారు .
                'అనంతం 'కవితా సంపుటిని ఆయన మూడు భాగాలుగా విడదీస్తారు.సాయం సంధ్య,అర్ధ రాత్రి ,ఉదయ సంధ్య అంటూ ఈ మూడు భాగాలుగా విభజించడం ఆయన సంపాదకత్వం వహించి ముద్రించిన అన్ని కావ్యాలలోనూ పాటించారు .ఆరుద్ర 'త్వమేవాహం 'సోమసుందర్ 'వజ్రాయుధం',అనిశెట్టి 'ఆగ్నివీణ',శశాంక 'నయాజమానా'రెంటాల 'సర్పయాగం''సంఘర్షణ'లను ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.బహుశా అది ఆనాటి సాంప్రదాయం కావచ్చు.శ్రీశ్రీ 'మహాప్రస్థానం'దీనికొక మినహాయింపు.
                 ప్రకృతికి సంబంధించిన రాంషా పరిశీలన అనుభూతులు చాలా హృద్యంగా ఉంటాయి .'గౌతమి'అనే కవితలో వేగంగా ప్రవహించే గోదావరిని చూసి కానరాని గోదావరి లోతు నీడలను చూసి కవులు పాడేందుకు వీలుగా నెమ్మదిగా వెళ్ళమంటాడు .
                                      "లోలోన కానరాని లోతు నీడలను 
                                         అమృతము చిలికించు ఆర్ద్ర గాత్రాల 
                                         పాడనీ పాడనీ పదిమంది కవుల 
                                                  ఓదివ్య గౌతమీ ఓ భవ్య గంగ 
                                                  పారకే పారకే పరువులన్ వారి"
               'సీతాకోక చిలుక' కవితలో కవి దాని అందంతోపాటు గొంగళి పురుగులనుండి సీతాకోక చిలుక రావడం ఆశ్చర్యంగా ప్రకటిస్తాడు .రాంషా ఈ కవితలో తన సృజనాత్మకతనూ ,వైజ్ఞానిక దృష్టినీ ఇలా మేలవిస్తాడు.
                                          "నీ మొదటి రోత రూపున్ 
                                            కాలాన విడిచి పెట్టే
                                            విపరీత సృష్టి స్నిగ్ధా 
                                            ............................
                                            నావంటి దు:ఖితులలో 
                                           చైతన్య మూర్తులంతా 
                                          నీవలెనె అవతరించన్...
            పువ్వులంటే రాంషా కు చాలా ఇష్టం వలె తోస్తుంది.అవి కలిగించే మధుర భావాలు మానవత్వాన్ని నిలుపుతాయనే ఆశను ప్రకటిస్తాడు.'కుసుమ లాస్యం' అనే కవితలో.సంధ్యా సమయంలో చీకట్లు ముదురుతున్న వేళ రాంషా తన సుకుమారమైన భావాలనూ,చిక్కనైన భావుకతనూ ప్రదర్శిస్తాడు.
                                         "అపుడే నా మనసులో 
                                          భావాల దొంతరలు 
                                         మొగాడు తలపులలోన 
                                         నర్తించి నర్తించి 
                                          నాలోన లోలోన 
                                         విరిసినవి కురిసినవి 
                                        మసక చీకటి మూయ 
                                        ముసుగులో మగతగా 
                                        జిగిసోన కురియుచూ 
                                        మనసార చవులూర 
                                         గరుడ వర్ధన సతులు 
                                         పకపకా నవ్వినవి"
             ఈ కవిత చదివిన తరువాత ఎవరికైనా కనుల ముందు ఒక సుందర దృశ్యం ఆవిష్కృత మౌతుంది .
             పూవుల్లాగానే రాంషా కు పిల్లలంటే అపరిమితమైన అనురాగం.చిన్న పిల్లలు,చిరునవ్వులు,స్త్రీలు,పువ్వులు లేక పోతే ఈ జగత్తుకు సౌందర్యం ఉండదేమో అని సందేహం ప్రకటిస్తాడు."అనుక్షణం దు:ఖ భూయిష్టమైన ఈ లౌకిక జగత్తులో అప్పుడు పుట్టిన బిడ్డకన్నాఆనంద దాయి ఏది?" అంటాడు రాంషా .అటువంటి బిడ్డలు గర్భశోకాన్ని కలిగిస్తే ?
             "కాల పరిధి పై జారి పడితిరా"  ఒక నిర్ణీత కాలం వరకే ఉండటానికి వచ్చారా అని అర్ధం కావచ్చు ఈ ప్రయోగానికి ."క్షణత్ ప్రభలుగావెలిగి పోదురా "    అంటారు ఈ కవితలోనే ,మెరుపును 'క్షణత్ప్రభ' అనే ప్రయోగం సరికొత్తగా కనబడుతుంది.'బాలల్లారా' కవితలో  అనుభూతులు అద్భుతంగా కురుస్తాయి.శ్రీశ్రీ శైశవగీతి వంటి నడక తో సాగే ఈ కవిత ఆద్యంతమూ మనోహరంగా ఉంటుంది .
                                           "కృత్రిమ మెరుగని పూవుల్లారా 
                                             కన్నులు విప్పని కన్డుల్లారా 
                                             గతియించిన ఓ చిటిక వెలుగులో 
                                             మెరసి మెరసి చిరునవ్వులు నవ్వే 
                                            సిగ్గుపడే నాపాపల్లారా పూపల్లారా 
                                            కాల పరిధిపై జారి పడితిరా 
                                            ........................................
                                            ప్రకృతిలోనే కృత్రిమ తత్వం 
                                            ఊరించును మీ వలపులు జల్లీ 
                                            కవ్వించును మీ పోలిక చూపీ 
                                            అంతలోనె ఇటె పోగొట్టును మము 
                                           క్షణత్ప్రభలుగా వెలిగి పోదురా 
                                            కన్నుల హరివిల్లుంచి పోదురా 
                                           గడియో అర గడియో ఆనందాబ్ధిని 
                                           ఓలలాడించిటె మాయమౌదురా
                                           ఇంద్రధనుస్సలె ఈల పాటవలె 
                                            .............................................
               పుత్రశోకం మీకు తెలియదు .అందులో నరకముంటుంది.అందుకే అస్సలు పుట్టకండీ అంటాడు కవి తీవ్రమైన విషాదాలను గుర్తుచేస్తూ.
               ప్రేమా ,జాలీ ,శాంతీ,దాన్తీ కోరుతూ దేవునికి మొక్కే మనుషులకు చిత్రమైన జవాబిస్తాడు రాంషా 'దేవుడు ' కవితలో .                                          "మనుషులు చేసిన దేవుని చుట్టూ 
                                              దౌర్భాగ్యంగా దురదృష్టంలో 
                                              ప్రేమా జాలీ శాంతీ దాంతీ
                                             కావాలంటూ దండాలిడుడురు 
                                            ..............................................
                                            ప్రేమా జాలీ శాంతీ దాంతీ 
                                             ఎక్కడ ఉండునొ  అక్కడే దేవుడు 
          ఈకవితను చదివితే గురజాడ వారి "మనిషి"కవిత 
                                          "  మనిషి చేసిన రాయి రాప్పకి 
                                            మహిమ గలదని సాగి మొక్కుతు
                                           మనుషులంటే రాయి రాప్పల
                                            కన్న కనిష్టం "             
          గుర్తుకొస్తుంది .ఈ రెంటిలో విషయపరమైన పోలిక ఉంటుంది .
              శ్రీ శ్రీ తన పరిణామ క్రమంలో నూతన వస్తువును ఎంచుకునే దశలో వ్రాసిన 'సుప్తాస్థికలు' కవితలో భూమి అడుగున ఉన్న మానవుని ఎముకల గురించిన ఊహలుంటాయి .
                                     "  ఆ మనుష్యాస్థికలు నిద్రలో మునింగి 
                                      సంచరించును భైరవ స్వప్నవీధి
                                       అవిచలించును తమ చర్మకవచ మెపుడొ  
                                       బ్రతికిన దినాల తలపోత బరువు చేత "
              ఇదే రకమైన వస్తువుతో 'సుధా పరీక్ష'కవిత వ్రాసాడు రాంషా .అయితే పోలికతో పాటు,భిన్నత్వమూ గోచరిస్తుంది .మృత్యు దేవత భూమి మీదకు వస్తే మరణించిన వ్యక్తి అస్థికలు తన గత కాలపు వెలుగులు పైలోకంలో ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తాయి .ఇదొక చిత్రమైన ఊహ .
                                  "   .............................
                                    నా బోసి నోటిపై 
                                    చిలుకరించిన చిందు 
                                    ఒలుక బోసిన వెలుగు 
                                    చిట్టి నాచిరునవ్వు   
                                   చెప్పవే చెప్పవే 
                                  చూచినావో లేదొ"
        శ్రీ శ్రీ 'ఉన్మాది 'కవితలో పిచ్చివాడి దీన స్థితిని వర్ణిస్తే రాంషా తన 'రాజ రాజు 'కవితలో అంధ బిచ్చగాడి స్థితిని మరొక పద్ధతి లో వర్ణిస్తాడు చూడండి .
                               శాద్వలమ్ముల చాలులోన
                               తాళ వృక్షపు తతుల ఛాయా
                               రాజ రాజి రాజ్యమేలాడు 
                               ఆ అంధ భిక్షువు .........
     ఆ అంధ భిక్షువు ఎవరో కాదు ,ఒక నాడు రాజ రాజుగా గడిపి ,పేదగా మారిపోయిన ఆంధ్ర రైతు .
    రాంషా 'మధుర స్మృతులు 'కవిత భావ కవిత్వపు ధోరణి లో ,ఆశు కవితా పద్ధతి లో ఉన్నా ఒక దేశ ద్రిమ్మరి లేక సంచార జాతి పిల్లను కధానాయికగా తీసుకోవడంలో విశిష్టత కనబడుతుంది.
            'మద్రాసు పర్యటన ' అనే కవితలో ఒక బ్రహ్మ రాక్షసి మద్రాసు నగరాన్ని సందర్శించి ఆనాటి సామాజిక పరిస్థితులను, ప్రభుత్వ పాలన లోని వపరీత్యాలను పరిశీలించడాన్నితీవ్రమైన వ్యంగ్యంతో ఆవిష్కరిస్తాడు రాంషా .
                             "దేశ రక్షణ పేరుతో వీరాగ్ర గణ్యుల
                             చేతులకు సంకెళ్ళు వేసి 
                              జైలులో శిక్షించు విధమునకు
                             బ్రహ్మ రాక్షసి ఆత్మ పొంగెను 
                             నరక మందున జైలు జీవిత
                             మెట్లుపెంపు పడంగ వలెనో
                             అడిగితే బాగుండు ననుకొని "
       ఈ పంక్తుల్లో కమ్యూనిస్టు వీరుల గురించీ ప్రస్తావిస్తాడు కవి .
       ఇలా క్రమంగా సుకుమారమైన భావాలనుండి ప్రయాణం కొనసాగిస్తూ రాజ్యంపై విమర్శలోకి చేరుకుంటాడు రాంషా .కందుకూరి మరణించి నప్పుడు వ్రాసిన ఎలిజీలో  ఆయనను స్నేహ పాత్రునిగా  అభివర్ణిస్తాడు .
                         "స్నేహ పాత్ర ఔచిత్యం 
                           ఎవని యందు కలిగిందో 
                           అట్టి జీవి చల్లారుట
                           జాలి కంటి నీటి కణం 
                          రాలదగిన సమయస్మ్రుతి
                          ఘనుడయ్యా కందుకూరి "
'   అరుణ తార పొడిచింది ' కవితలో ఫ్యూడల్ అధికారపు ప్రతీకగా ఉన్న పూల పల్లకినీ ,రాజ భవనాన్ని ,సిమ్హాసనాన్నీ,న్యాయాధికారినీ "ఇంకానా ఇకపై సాగదంటూ"హెచ్చరిస్తాడు .ప్రజలు రాజ్యాదికారులను కూలదోసి రాజులౌతారని చెబుతాడు .
                        "  కులాల,తెగలన్ ,జాతుల త్రెంపీ
                          పరుశురాములై రాజుల త్రోసీ 
                          ఆటను కట్టే ,ప్రజాస్వాములై 
                          భూక్షేత్రం పండిస్తారు ."
    ఇలా తన అభ్యుదయ భావజాలాన్ని ప్రకటిస్తూ తాను ఈలోకంలో పాపాత్ములని భావించే కర్షకులకూ,కూలీలకూ ,బానిసలకూ కవిని నేనే నని సగర్వంగా తెలియజేస్తాడు రాంషా 'సంజాయిషీ 'అనే కవితలో.
                    "రాంషా తన కొద్దిపాటి కవితల్లో తన ప్రతిభను బహుముఖాలుగా చాటడం అద్భుతంగా ఉంటుంది.ఈ శ్రామిక పక్షపాతి అయిన కవి రాంషా సాహిత్యాన్ని విమర్శకులు పరామర్శించి సాహితీ ప్రపంచంలో తగిన గౌరవం కల్పించాల్సి ఉంది.
                                      ........ సమాప్తం ............


                                                                  

14, అక్టోబర్ 2010, గురువారం

                     పగటి కల (పుస్తక సమీక్ష )


రచయిత: గిజుభాయి బగేకా 
మూలం : దివా స్వప్న (గుజరాతీ)
అనువాదం : పోలు శేషగిరిరావు 
ప్రచురణ : హైదరాబాదు బుక్ ట్రస్ట్ 


కవర్ పేజీలు  : 
       మొదటి కవర్ పేజీ బ్లాక్ అండ్ వైట్ లో ఉపాధ్యాయుని చుట్టూ నిలబడ్డ విద్యార్థుల ఫోటో ఉంది .పుస్తకం పేరు బ్రష్ తో వ్రాసినట్లు ఉంది .అట్ట ఆకర్షణీయంగా లేక పోయినా ఆసక్తి రేకెత్తించేదిగా ఉంది.బాక్ కవర్ పై పుస్తకం లోని అంశం యొక్క లక్ష్యాన్ని తెలిపే విషయాల్ని క్లుప్తంగా ముద్రించారు.
ముందుమాటలు : 
       ఈ పుస్తకాన్ని చదివే ముందు మొదటి పేజీలలోని ముందు మాటలు తప్పక చదవాలి."గిజుభాయి ఒక స్వాప్నికుడు" అంటూ గిజుభాయి జీవితవిశేషాల్ని  ,విద్యా సంబంధమైన ఆయన కృషిని పరిచయం చేసారు.గిజుభాయి బగేకా మిత్రుడు హర్ భాయీ త్రివేదీ 'ఏమిటీ పగటికల' అంటూ పగటికలకు సంబంధించీ గిజుభాయి హృదయాన్ని ఆవిష్కరిస్తారు.  పుస్తకం లోని భావనల్ని ,విశేషాల్నిమనకు పట్టిస్తారు. 
       మొత్తం పుస్తకాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టారు గిజుభాయి . ప్రయోగం ప్రారంభం అనే శీర్షికతో నవల మొదలు  అవుతుంది.మొత్తం కథలో కథానాయకుడు లక్ష్మీ శంకర్ సాంప్రదాయ బోధనా పద్దతులను త్రోసి పుచ్చడం ,వాటిని అసహ్యించుకోవడం ,ప్రజాస్వామ్య పద్దతిలో బోధనను కొనసాగించడం,ఆ క్రమంలో విద్యార్థులనుండి,సమాజం నుండి ,అధికారులనుండి చివరకు సాటి ఉపాధ్యాయులనుండి ఎదురయ్యే సమస్యలను అత్యంత ఆత్మ విశ్వాసంతోనూ ,ప్రతిభావంతంగానూ ఎదుర్కొని తాను నమ్మిన తాత్విక ఆలోచనలకు ఆచరణాత్మక విజయాన్ని సాధించడమేగాక అందరి ప్రశంశలు అందుకోవడంతో ముగుస్తుంది.
       కథలో అడుగడుగునా ఉపాద్యాయుడు ఎదుర్కొనే సన్నివేశాలను హృద్యంగానూ ,ప్రతిభావంతంగానూ ,సహజంగానూ ,చిత్రిస్తాడు రచయిత . ప్రయోగ శీలియైన ఉపాధ్యాయుని అపజయాలను, విజయాలను కూడా హాస్యంతో మేళవించి మనముందు ఉంచుతాడు గిజుభాయి.అపజయాలకు కారణాలనూ సమీక్షిస్తాడు.విజయం సాధించడానికి కావలసిన సహనాన్ని పట్టుదలనూ,ప్రణాళికనూ అంతకు మించి బాలల పట్ల ప్రగాఢమైన ప్రేమను ఏ మోతాదులో ఉపాధ్యాయులు కలిగి ఉండాలో ఈ రచనలో తెలియ జేస్తాడాయన.
         గిజుభాయి విద్యార్థుల విషయంలో బోధన విషయంలో అభ్యుదయ కాముకుడుగా ఉండటమే కాదు సాంప్రదాయ పద్దతిలో పనిచేసే ఉపాధ్యాయుల పట్ల జాలి ,వారి వేతనాల విషయంలో అసంతృప్తీ కనబరుస్తాడు. వేతనాల పెంపుకోసం ఉద్యమాలు చేయండని సలహా కూడా ఇస్తాడు.ఈ సంఘటన కథలో సృష్టించడం ద్వారా ఆయన సామాజికంగా కూడా అభ్యుదయ భావజాలంతో ఉన్నాడని స్పష్టం అవుతుంది.
కథా క్రమం :
రచయిత, భావుకుడూ, అయిన లక్ష్మీ శంకర్ విద్యా శాఖ లోని ఉన్నతాధి కారి వద్దకు వెళ్లి ప్రాథమిక పాఠశాలలోని ఒక తరగతిని తన సిద్దాంతాలను ఆచరించే ప్రయోగంకోసం అడుగుతాడు.అధికారి మొదట నిరుత్సాహ పరిచినా ,అతని పట్టుదల చూసి ఒక సంవత్సరం పాటు ఒక పాఠశాలలో  నాల్గవ  తరగతిని అప్పగిస్తాడు .ఎటువంటి ప్రయోగాలు చేసినా కొలబద్ద మాత్రం పరీక్షలే అని హెచ్చరిస్తాడు ఆ అధికారి .
         తొలిరోజు  పాఠశాలలో అడుగు పెట్టిన లక్ష్మీ శంకర్ భావోద్వేగాలను ఇలా వివరిస్తాడు రచయిత.


"ఎప్పుడు పాఠశాల ప్రారంభ మవుతుందా ఎప్పుడు, క్లాసు బాద్యతను తీసుకొని ,పని ప్రారంభిద్దామా ,ఎప్పుడు నానూతన ప్రణాళికను అమలు పరుద్దామా,ఎప్పుడు  క్లాసులో క్రమ శిక్షణనూ , ప్రశాంతతనూ,నెలకొల్పుదామా,ఎప్పుడు రసవంతంగా బోధిద్దామా,ఎప్పుడు విద్యార్థుల మనస్సులను ఆకర్షిద్దామా,అని నేను ఆలోచిస్తున్నాను .బహుశా ఆ సమయంలో నా మెదడు లోని రక్తం కూడా అతి వేగంగా పరుగులు తీస్తూ ఉండవచ్చు అనుకుంటాను " ఇలా   సాగుతాయి అతని ఆలోచనలు .కానీ అతని అనుభవం అందుకు భిన్నంగా ఉండి,ఆకాశంలోని ఊహలు నేలమీదకు దిగుతాయి.విద్యార్థుల క్రమ శిక్షణా రాహిత్యం అతని తొలి రోజు ప్రణాళికను నాశనం చేస్తుంది .పాఠశాల మరో రెండు గంటలు నడువ వలసి ఉండగానే నాల్గవ తరగతికి సెలవు ప్రకటిస్తాడు .తనను అడుగకుండా సెలవు ప్రకటించినందుకు కోపం తెచ్చుకుంటాడు ప్రధానోపాధ్యాయుడు .        "మీరు చెబుతున్నట్లు ఆసక్తి గీసక్తి ,అవధానం గివధానం అన్నీ కట్టి పెట్టండి .ప్రాథమిక పాఠశాల పిల్లలు చెంపదెబ్బ పడితేనే చెప్పినట్లు వింటారు .అందరూ నియమ పూర్వకంగానే చదివిస్తున్నారు .మీరుకూడా ఆ దారిలో బోధిస్తేనే సంవత్సరాంతానికి సత్ఫలితం కనిపిస్తుంది .మీ ప్రయోగం తో వాళ్ళముందు నవ్వుల పాలయ్యారు .పైగా ఒక రోజు కూడా నష్టపోయారు "     అంటాడు ప్రధానోపాధ్యాయుడు .
          ఇక లక్ష్మీ శంకర్ తను తొలి రోజు చేసిన పొరపాటు ఏమిటో సమీక్షించుకొని ,రెండవ రోజు కథలతో మొదలెట్టి విద్యార్థుల అభిమానాన్ని గెలుచు కుంటాడు .ఆ క్రమంలో వారికి శ్రద్దగా కూర్చోవడం ,పరిశుభ్రంగా ఉండటం ,క్రమశిక్షణ ,ఆదర్శ పఠనం ,ఉక్తలేఖనం మొదలైనవన్నీ నేర్పుతాడు .
         పిల్లలు మురికి టోపీల్తో రావడం చూసి వాటిని లేకుండా వచ్చేందుకు అనుమతి ఇవ్వమని కోరితే సమాజానికి వ్యతిరేకంగా నేనేమీ చేయలేనంటాడు .కాస్త లౌక్యంగా వ్యవహరించ మంటాడు.టోపీలు లేకుండా పాఠశాలకు రావడానికి తల్లి దండ్రులు అనుమతించక పోగా "మీ పంతులుకు పిచ్చి పట్టిందా ఏమిటి?"అని అడుగుతారు .ఒక రోజు విద్యార్థులకు ఆటలు నేర్పబోతే ఒకడి కొకడు తల పగుల గోట్టుకుంటారు .ఉపాద్యాయులూ ,ప్రదానోపధ్యాయుడూ ,మరోసారి లక్ష్మీశంకర్ కు బుద్ధి చెప్పేందుకు పూనుకుంటారు .
         "ఏమిటండీ ఈ ఆటలూ,పాటలూ మానేయ్యండి ? వీళ్ళు భయ భక్తులు లేకుండా పెరిగిన జనం .వట్టి పోకిరీ మూక .వీళ్ళను పాఠశాలలో  బంధించి  ఉంచాలి .చదివించాలి .వల్లే వేయిచాలి .అలా చేయండి .వీళ్ళను స్వేచ్చగా వదిలేస్తే ఒకరి తల ఒకరు పగులగొట్టు కుంటారు .రోజూ వీధులలో ఎం జరుగుతున్నదీ మీకుమాత్రం తెలియదూ" అంటాడొక ఉపాధ్యాయుడు .
       తల్లి దండ్రుల సమావేశం పెడితే ఆహ్వానాలు 40 మందికి హాజరు 7 గురు .ఉపన్యాసం పూర్తయ్యేసరికి ఇద్దరు ,చివరికి ,ఉపాధ్యాయులూ ,ఉన్నతాదికారీ మిగులుతారు .
      ఒకరోజు డైరెక్టర్ గారి విజిట్ జరుగుతుంది .ఆయన విజిట్ నుండి తన క్లాసును మినహాయించ  మంటాడు లక్ష్మీశంకర్ .ప్రధానోపాధ్యాయుడు ఉన్నతాధికారికి పిర్యాదు చేస్తాడు.ఉన్నతాదికారితో మాట్లాడిన తర్వాత నాల్గవ విద్యార్థులతో ఒక కార్యక్రమం ఏర్పాటుకు ఒప్పుకుంటాడు లక్ష్మీశంకర్ .ఆ రోజు నాల్గవ తరగతి పిల్లలు అత్యంత సహజంగా అత్యంత క్రమశిక్షణతో నాటికలను ప్రదర్శిస్తారు .దీన్ని చూసిన డైరెక్టర్ లక్ష్మీశంకర్ ను మెచ్చుకొని ,తన ప్రయోగాలను మున్డుకుతీసుకొని పొమ్మంటాడు .తన ప్రయోగాలు గుర్తింపుకు నోచుకున్నందుకు మొదటి సారి ఆనంద పడతాడు లక్ష్మీ శంకర్ .
      తనదైన పద్దతిలో వ్యాకరణం ,భూగోళం ,చరిత్ర మొదలైన విషయాలు నేర్పి ,ఆరునెలల పరీక్షకు తయారు చేస్తాడు .పరీక్షలన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంటాయి .ఉన్నతాధికారి విద్యార్థుల ప్రతిభ చూసి  ఆశ్చర్య పడతాడు .లక్ష్మీ శంకర్ ను తనింటికి పిలి పించుకుని వివిధ విషయాలను విద్యార్థులకు నేర్పే పద్ధతి తెలుసుకొని అభినందిస్తాడు .ఉపాధ్యాయులు సానుకూలంగా మాట్లాడినా తాము ఆ విధానాలను అవలంభించడం లో గల కష్ట నష్టాలను తెలియజేస్తారు .జీతాలు తక్కువగా ఉన్న విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు పోరాడాల్సిన ఆవస్యకతనూ లక్ష్మీ శంకర్ ఉపాధ్యాయులకు తెలియజేస్తాడు .
       వార్షిక పరీక్ష లో విద్యార్థులూ .లక్ష్మీ శంకర్లు కూడా ప్రశంసలు పొందడంతో నవల ముగింపు జరుగుతుంది .కదా గమనం పాఠకులను తనతో పాటు తీసుకు పోతుంది .ఉపాధ్యాయులు నిత్యం అనుభవిస్తున్న బోధనా సమస్యలకు పరిష్కారాలు చూపిస్తుంది .ప్రజా స్వామ్య పద్ధతి లో విద్యార్థులకు బోధించే మార్గాన్ని వివరిస్తుంది .ఉపాధ్యాయులైన వారు ప్రేరణ పొందేందుకు  చదవాల్సిన పుస్తకం గిజుభాయి వ్రాసిన పగటికల 
       తన కలను నిజం చేయగల భావితరం ఉపాధ్యాయులకోసం ఈ పగటి కలను కంటాడు గిజుభాయి .సుమారు 80 ఏండ్ల వయసున్న ఈ కలను ఈనాటి ఉపాధ్యాయులైన మనం నిజం చేయాల్సి ఉంది
                            శారీరక దండన లేకుండా బోధన సాధ్యం కాదా ?


            శారీరక దండన లేకుండా బోధన సాధ్యంకాదా ? అనే ప్రశ్న ఈనాడు మన ఉపాధ్యాయులంతా తప్పని సరిగా వేసుకోవాల్సి వస్తుంది . ఎందుకంటే  ఇటీవల ఉపాధ్యాయులలో కొందరు , విద్యార్థులకు విధిస్తున్న శిక్షలు మానవతా పరిధిని దాటుతున్నాయి .ఆ కొద్ది మంది చేసిన నిర్వాకం వారి పాల బడ్డ విద్యార్థుల దృష్టి లో ఉపాధ్యాయులను రాక్షసులుగా చూపిస్తోంది కాబట్టి .ఆ కొద్ది మంది చేసిన నిర్వాకం మీడియా సహకారంతో సమాజం ముందు ఉపాధ్యాయులందరినీ దోషులుగా నిలబెడుతోంది కాబట్టి.
            ఒక ఉపాధ్యాయుడు,ఆలస్య మైనందుకు విద్యార్థుల చేత 600 ల గుంజీలు తీయించాడు .గుజీలు తీసిన 40 మందీ హాస్పిటల్ పాలవడమే కాక అందులో 20 మందీ గుంజీలు తీస్తూనే స్పృహ తప్పి పడిపోయారు.ఇంతకూ వారు ఆలస్యమైంది కేవలం రెండు నిముషాలు.
           తరగతి గదిలో అల్లరి చేసినందుకు ఒక ప్రదానోపాధ్యాయురాలు 11 మంది విద్యార్థులకు పొయ్యిలో కాలుతున్న వంటచెరుకుతో వాతలు పెట్టారు.ఆడుకుంటూ ఎల్ కే జీ విద్యార్థులపై పడ్డారని మరొక ఉపాధ్యాయుడు బెత్తంతో 5 గురు విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టాడు .
          మొదటి సంఘటన ఆదిలాబాద్ ,మిగతా రెండు వరంగల్ లో జరిగాయి .మొదటి రెండూ ప్రభుత్వ పాఠశాలలు మూడవది ప్రైవేటు పాఠశాల  మొదటి సంఘటనా, మూడవ సంఘటనల్లో ఉపాధ్యాయులు పురుషులైతే రెండవ సంఘటనలో స్త్రీ .ఈ రకమైన ఘటనలలో  జిల్లాల ఎల్లలు లేవు .ప్రభుత్వ ప్రైవేటు తేడాలు లేవు .స్త్రీ పురుష భేదాలు కూడా లేవు .
          తరగతి గదిలో ఆడు కుంటున్నందుకు 16 ఏండ్ల అమ్మాయిని ఓ పంతులమ్మ చితగ్గొడితే ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది .ఆవిడ  చేతిలోనే మరో ముగ్గురు విద్యార్థినులు ప్రాణాలు కొల్పోయారట గతంలో .ఇవన్నీ చూసిన తర్వాత శారీరక దండన లేకుండా బోధన సాధ్యం కాదా అనే ప్రశ్న వేసుకోవాలనిపించడం లేదూ?
          నిజానికి దండనకు సంబంధించి కేవలం ఉపాధ్యాయుడిని మాత్రమే నిందించడం సరికాదని మనకు తెలుసు .దీనికి అనేక వ్యవస్థాగత ,సామాజిక ,కారణాలున్నాయి .ప్రభుత్వం గానీ, ప్రైవేటు యాజమాన్యం గానీ వ్యవస్థాగత కారణాలను ఏమాత్రం సరి చెయ్యక పోగా మరింత పెంచుతుంది .పాఠశాలలో తగినన్ని గదులు లేక పోవడం ,ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తి సరిగా పాటించక పోవడం ,బండెడు సిలబస్ ,పుస్తకాల పంపిణీ లో తీవ్రమైన ఆలస్యం ,పరీక్షలకై పరుగులేత్తించడం ఇవన్నీ ఉపాధ్యాయుడిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాయి .ఆ ఒత్తిడి విద్యార్థికి దండన రూపంలో బదిలీ అవుతుంది .
         పిల్లలు అల్లరి చేయడం ,ఆడుకోవడం సహజమనే అధికారులే ,వారు ఏదైనా పాఠశాలను పర్యవేక్షణకు వెళ్లి నప్పుడు అంతా ప్రశాంతంగా ,నిశ్శబ్దంగా ఉంటే గొప్ప పాఠశాలగా కీర్తిస్తారు .వారిని అలా ఉంచేందుకు ఉపాధ్యాయులు ఏ పద్దతిని అనుసరిస్తున్నారో గమనించరు.ఒకటి కోరుకుంటూ ,మరొకటి చెప్పడం అధికారులకు అలవాటే .విద్యావేత్తలందరూ ర్యాంకుల కోసం గొంతులు కోసుకునే పోటీ సరైంది కాదని చెబుతూంటే ,రాజీవ్ విద్యా మిషన్ వారు తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారి ఫోటోలను నోటీసు బోర్డుపై ఉంచాలని ,సబ్జెక్టు  వారీ గ్రాఫును ప్రదర్శించాలనీ అతి పొడవైన గ్రాఫుకోసం ఉపాధ్యాయులను పోటీ పదమనీ చెబుతున్నారు .
          ఈ రకమైన ఫలితాలకోసం ఉపాధ్యాయులు దండనను ఆశ్రయించే అవసరాన్ని పెంచుతున్నారు.ఏది ఏమైనా విద్యార్థి తీవ్ర దండనకు గురైతే రిజల్ట్ కావాలనే ప్రభుత్వం గానీ తల్లిదండ్రులు గానీ ఉపాధ్యాయుడినే నిందిస్తారు .కాబట్టి శారీరక దండన లేకుండా విద్యార్థికి బోధించలేమా? అనేది ఉపాధ్యాయునికి సంబంధించినంతవరకూ ఒక మౌలిక ప్రశ్న అవుతుంది .
         అందరు ఉపాధ్యాయులూ విద్యార్థులకు తీవ్రమైన భౌతిక దండనలు విధించాలని అనుకోరు .కానీ,అసలు బెదిరించకపోతే ఎలా ? అనో ,చిన్నగా దండించడం వల్ల నష్టం ఉండదనో ,దండిచకపోతే చదువెలా వస్తుందనో ,నేను మాపెద్దలు ,టీచర్ల చేతిలో శిక్షించ బడటం వల్లనే ఇంతవాడినయ్యాననో వంటి కొన్ని అభిప్రాయాలుంటాయి .ముఖ్యంగా భారతదేశం లో దేవునికంటే ముందు స్థానం గురువుకే కట్టబెట్టారు .ఆయన అధికారాల్ని ప్రశ్నించే హక్కు సమాజంలో ఎవరికీ ఉండేది కాదు .
          కానీ సమాజం మారింది .నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం వైపు ప్రయాణం చేస్తున్నాం .అది పాఠశాల తరగతి గదుల్లోనే వికసించాల్సి ఉంది .కలకత్తాలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ దండిస్తే భయపడిన విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్నాడు .ప్రిన్సిపాలును కోర్టు బోనులో నిలబెడితే ,విద్యార్థిని దండించడం తప్పనే విషయమే తనకు తెలియదన్నాడు .మనకు తెలిసినా ,తెలియక పోయినా చట్టం తనపని తాను చేసుకు పోతుంది .ఈ తరుణం లో శారీరక దండన లేకుండా విద్యార్థికి బోధించలేమా ? అనే ప్రశ్న ఉపాధ్యాయుడు వేసులోవాలి.
           విద్యార్థిని దండించే విషయం లో ఉపాధ్యాయుడు తనవైపు నుండి ఉండే కారణాలను ఆత్మవిమర్శతోనూ ,ఆత్మనిగ్రహం తోనూ ,సవరించుకోవాలి .దండన ఉపయోగించే అంశాలైన గైర్ హాజరు,క్రమ శిక్షణ,క్లాసులో పాఠము పై దృష్టి కేంద్రీకరించక పోవడం ,సమాధానాలు చెప్పక పోవడం ,చదవక పోవడం ,హోం వర్కు చేయక పోవడం ,పరీక్షలు సరిగా వ్రాయక పోవడం వంటి అనేక సమస్యలను లోతుగా విశ్లేషించ గలిగితే విద్యార్థిని దండించే పరిస్థితినుంచి ఉపాధ్యాయుడు తప్పుకోగలుగుతాడు.ఈ విశ్లేషణ చాలా సహనం తోటీ విద్యార్థిపై చాలినత ప్రేమ తోటీ జరగాలి .వీటి వెనుక విద్యార్థి నేపథ్యం ,సామాజిక ,ఆర్ధిక కారణాలు దాగుంటాయి .వాటిని మనం అర్థం చేసుకుంటే విద్యార్థిపై కోపానికి బదులు జాలి కలుగవచ్చు .తద్వారా వాటిని మూలాల్లోంచి తొలగించేందుకు కృషి చేయవచ్చు .
          పైన ఉదాహరిచిన అన్ని సందర్భాలలోనూ దండించే తీవ్రత ఒకేలా ఉండదు .అలాగే ఒకే తప్పుకు వేర్వేరు ఉపాధ్యాయుల ప్రతిస్పందన కూడా వేర్వేరుగా ఉంటుంది .దీనికి కారణాలు ఉపాధ్యాయుని మూర్తిమత్వంలో ఉంటాయి .ఉపాధ్యాయులలోని గుణ దోషాలే తీవ్ర శారీరక దండనలకు కారణం అవుతాయి.వాటిలో కొన్నింటిని ప్రస్తావించుకుందాం .
        కోపం 
       కొంతమడికి కోపం ఎక్కువగా ఉంటుంది .దానికి కారణం వారి కుటుంబ నేపథ్యం కావచ్చు ,ఆరోగ్య పరిస్థితి కావచ్చు.వారెంత వారైనా కోప లక్షణం ఉన్నవారు తమ చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలు కోల్పోతారు .కోపం ఒక మానసిక బలహీనత .దీన్ని తొలగించుకోక పోతే ఏ విద్యార్తులకోసమైతే ఉపాధ్యాయులు బోధిస్తున్నారో వారికే ఉపాద్య్హాయుల  పట్ల వ్యతిరేక భావం ఏర్పడుతుంది .మనకు కోపం వచ్చిన ప్రతిసారీ దాన్ని ఎవరి మీద బడితే వారి మీద ప్రదర్సించం .దాన్ని బలహీనులపైనే తేలిగ్గా ప్రదర్శిస్తాం .అలా అనుకున్నప్పుడు గతంలో వలె విద్యార్థి బలహీనుడు కాదని మనం అర్థం చేసుకోవాలి.చట్టం ,రాజ్యాగం ఈనాడు విద్యార్థికి మద్దతు ఇస్తోంది .
       అహం 
       ఇది సమాజం లో వేళ్ళూనుకుని ఉన్న భూస్వామ్య( ఫ్యూడల్ ) భావజాలం నుంచి సంక్రమిస్తుంది .యజమాని శ్రామికునికన్నాగొప్ప వాడనుకుంటాడు .భర్త,భార్యాకన్నా గొప్ప వాడనుకుంటాడు .పోలీసు నేరస్తుడిని ఏ విధంగానైనా శిక్షించ వచ్చు నను కుంటాడు.అదే విధంగా ఉపాధ్యాయుడు కూడా విద్యార్థిపై సర్వ హక్కులూ ఉన్నాయనుకుంటాడు.ఆ అదికారం ప్రశ్నించ బడినప్పుడో ,ఆదేశాలు పాటించ బడనప్పుడో విద్యార్థిని శిక్షించ బూనుకుంటాడు .భయోత్పాతం సృష్టించి గౌరవం పొందాలనుకుంటాడు .దీన్ని మనం సరి చేసుకుని ఆత్మగౌరవం గల విద్యార్థిని దేశానికి అందించాలి .ఎదుటివారి ఆదేశాల్ని గుడ్డిగా పాటించేవారిని కాదు .
        ఉపాధ్యాయుని సంసిద్దత 
        ఉపాధ్యాయుడు బోధనకు సరైన ప్రణాళిక తో తయారు కాకపోవడం కూడా తరగాతి గదిలో క్రమశిక్షణా రాహిత్యానికి ,ఆపై దండనవిధించే పరిస్థితులకూ కారణం అవుతుంది .తరగతి గదిలో ఉపాధ్యాయుని బోధన విద్యార్థిని మమేకం చెసేదిలా ఉండాలి .
         సరైన  స్వరం 
         బోధించే సమయం లో కొందరు ఉపాధ్యాయులు పెద్ద గొంతు తో అరచి బోధిస్తారు.అలా చెప్పడం సరైనదిగా భావిస్తారు .పెద్ద గొంతు ఆధిక్యతకు చిహ్నం గా భావిస్తారు.కానీ అది సరికాదు .అలా చేయడం వల్ల ఉపాధ్యాయుని స్వరమే తప్ప సారాంశం చెవికి చేరదు .ఆసక్తి తగ్గి అల్లరి మొదలు పెడతారు .ఉపాధ్యాయుడు మరింతగొంతు పెంచాల్సి వస్తుంది .ఇది ఉపాధ్యాయుని ఆరోగ్యానికి కూడా ముప్పు కలిగిస్తుంది.చక్కని స్థాయిలో విద్యార్థులను ఆకట్టుకునే స్వరంతో బోధన జరిపితే క్రమశిక్షణా రాహిత్యానికి అవకాశం తగ్గి దండన అవసరం తగ్గుతుంది .
       ఆరోగ్యం 
     మానసికంగా ,శారీరకం గా ,ఆరోగ్యంగా ఉండే ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతాడు .అటువంటి స్థితిలో దండన అవసరం దాదాపుగా ఉండదు .దీనికోసం ఉపాధ్యాయుడు ప్రతీ రోజూ తన ఆరోగ్యానికి కొంత సమయం కేటాయించాలి .ఆరోగ్యానికి చెరుపు చేసే అలవాట్ల నుండి దూరంగా ఉండాలి.సమతులాహారం తీసుకోవాలి .తగినంత విశ్రాంతి తీసుకోవాలి .డా .సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆదర్శంగా ఈవిషయం లో తీసుకోవచ్చు.ఆయన రాత్రి 10 గంటలు దాటితే ఎట్టి పరిస్తితిలోనూ మేల్కొని ఉండేవారు కాదు రష్యా లో రాయబారిగా ఉన్నప్పుడుకూడా తన అలవాటును మార్చుకోలేదు .సాక్షాత్తూ కా .స్టాలిన్ కూడా తన సమావేశాలను ఆయన కోసం సర్దుబాటు చేసుకునేవారు .
        కుటుంబ జీవనం 
       ఉపాధ్యాయుని కుటుంబ జీవనం ,పరిస్థితులు తరగతి గదిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది .ఉపాధ్యాయుని కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ,ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి .కుటుంబ సభ్యులతో తన ప్రవర్తనను దానికి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవాలి .ఒకవేళ ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాకూడా పాఠశాలలోకి దాని ప్రభావం రాకుండా చూసుకోవాలి .
    అధ్యయనం 
          ఉపాధ్యాయ వృత్తి లో అధ్యయనం నిరంతర స్రవంతిలా ఉండాలి.అనేక వృత్తుల వారు వారి వారి వృత్తుల్లో వచ్చిన పాత కొత్త విషయాలను అధ్యయనం చేస్తుంటారు .అలాగే ఉపాధ్యాయులు శారీరక దండన లేకుండా బోధించే విషయాలను తెలుసుకునేందుకు నిరంతరం అధ్యయనం చేయాలి .దండనను విడచి పెట్టేందుకు అవసరమైన అనుభవాలను నిక్షిప్తం చేసిన అనేక పుస్తకాలు తెలుగులో అందుబాటులో ఉన్నాయి .వాటిని చదివి ఆచరణలో పెట్టడం ద్వారా దండన నుండి దూరంగా జరుగవచ్చు .డా .చుక్కా రామయ్య గారు వ్రాసిన రామయ్య జ్ఞాపకాలు ,గిజుభాయి సమగ్ర సాహిత్యం ,సుహోమ్లీన్ స్కీ వ్రాసిన "పిల్లలకే నా హృదయం అంకితం ,రైలు బడి ,సమ్మర్ హిల్ అనుభవాలు ,చలం వ్రాసిన బిడ్డల పెంపకం వంటి పుస్తకాలు మన బోధనను సుసంపన్నం చేస్తాయి.గిజుభాయి సమగ్ర సాహిత్యం మొదటి సంపుటిలో విద్యార్థుల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు ,వాటికి సరైన నివారణోపాయాలు పట్టిక రూపంలో ఇవ్వ బడినాయి .


         ఈనాడు భౌతిక దండనను అనేక దేశాలు ,మనదేశంలో అనేక రాష్ట్రాలు నిషేధించాయి .అయినా తరుచుగా విద్యార్థులపై విధింపబడే అమానుష శిక్షల గురించి వింటూనే ఉన్నాము .అనేక చట్టాలు ,రాజ్యాంగము ,సమాజంలో అత్యంత బలహీనుడైన విద్యార్థికి అండగా ఉన్న ఈ తరుణంలో ఉపాధ్యాయులు vidyaarthi  పట్ల మరింత ప్రేమతోనూ ,సహనంతోనూ ,జాగరూకతతోనూ వృత్తిని నిర్వహించాలి.ప్రతిరోజూ  పాఠశాలకు వెళ్ళే సమయంలో శారీరక దండన లేకుండా విద్యార్థికి  బోధించలేమా ? అని ప్రతి ఉపాధ్యాయుడూ తననుతాను ప్రశ్నించుకోవాలి.

7, అక్టోబర్ 2010, గురువారం

                   నువ్వు నాక్కనిపించావు 
నువ్వు నాక్కనిపించావు 
నన్ను నేను మళ్ళీ ఒకసారి చూచు కున్నాను .
జ్ఞాపకాల దారిలో వర్తమానం నుండి 
గతం గదిలోకి వెళ్లి 
పెట్టెలోంచి తొలి యవ్వనపు దుస్తుల్ని బయటికి తీసాను 
ఇంకా పాతబడలేదు ,మెరుపూ తగ్గలేదు 
చేతులు వణుకుతూంటే 
శరీరం చిన్నగా కంపిస్తూంటే 
గుండె కొట్టుకుంటున్న శబ్ధం వినిపిస్తూంటే 
కొద్దిగా భయం కొద్దిగా సిగ్గు 
కళ్ళు పూర్తిగా తెరవకుండానే వేసుకున్నాను 
కళ్ళలో ఓ పెద్ద మెరుపు మెరిసింది 
బుగ్గలపై పాకింది 
చిరునవ్వై విచ్చుకొంది 
పెదవులపై తళుక్కుమంది 
రక్తంలో జలపాతపు హోరు 
జాగ్రత్తగా విందును కదా మధ్యలో కిలకిల నీ నవ్వు 
ఆ ప్రకంపనలు ఒంటిని తీయగా కుదిపేస్తున్నాయి  
అందరూ కళ్ళ ముందే ఉన్నా ఎవ్వరూ కనపడరు 
అన్నీ వినిపిస్తూనే ఉన్నా ఏదీ గుర్తింపుకు రాదు 
కొద్ది పాటి నిషాలో ఉన్నట్లు మాటలు దూకుతుంటాయి 
వాటిని విన్నవాళ్ళు ఎందుకో   ఆశ్చర్యంగా నావైపు చూస్తుంటారు 
అర్థం కాదు ,అయినా అసలు పట్టించుకో బుద్ధి కాదు 
ఎవరు ఏ మాటన్నా ఎందుకో బాధ అస్సలు కలుగదు 
తమాషాగా చిరునవ్వు చిందుతుంది 
ఏమిటిది ?స్థిత ప్రజ్ఞాతా కాదు 
ఒంట్లో ఉరుకుతున్న ఉద్వేగాల వరద అబద్దం చెబుతోంది 
కాస్త కిందికి చూద్దును కదా 
శరీరం కొత్తగా కనబడుతోంది 
అయస్కాంతం వేలవేల వోల్టులతో విద్యుదీకరించ బడినట్లు 
ఆకర్షణ బలీయమవుతోంది 
ఈ బలం నాదేనా ?
ఈ ఆకర్షణ నాదేనా ?
ఎక్కన్నుంచైనా తెచ్చి పోశానా?
నాలోనించే తవ్వి తీశావా ?
ఎవరీ కొత్త నేను ?
ఏమిటో ఈ గందర గోళం 
నాకు నువ్వంటే ఇష్టమా ?
నీలో ప్రతిఫలిస్తున్న నేనంటే ఇష్టమా ?
అంతా అయోమయం 
నువ్వునాక్కనిపించాక 
                             

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

దండన పాపం ఉపాధ్యాయుడిదేనా?


నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ రైట్స్ ఆదేశాలతో కొన్ని జిల్లాలలో బాల బాలికల హక్కులు పరిరక్షించేందుకు ప్రొటెక్షన్ సెల్స్ ఏర్పాటవుతున్నాయి .అలా ఏర్పాటయిన ఒక జిల్లాలోని పత్రికా ప్రకటనలను చూస్తే ఉపాధ్యాయులను విలన్స్ గా చూపించే ప్రయత్నం కనపడుతోంది ."గురువుల వేధింపులకు అడ్డు కట్ట " విద్యార్థులను కొట్టే టీచర్లకు దండన " దండనకే దండన ".వీటిని చూసినవారెవరైనా ఉపాధ్యాయులను గౌరవనీయ స్థానం నుండి రాక్షసుడి స్థానానికి బదిలీ అవకాశముంది .అయితే ప్రొటెక్షన్ సెల్ వద్ద్దనీ ,విద్యార్థులను భౌతికంగా దండించడం సబబనీ చెప్పడం ఉద్దేశ్యం కాదు .విద్యార్థులు దండనకు గురి కావడానికి కొందరు ఉపాధ్యాయులతో పాటు వ్యవస్థాగత ,సామాజిక కారణాలున్నాయనీ, వాటిని కూడా విశ్లేషించు కోవడం అవసరమనీ , తెలియజెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం .
               పిల్లలకై తమ హృదయాల్ని అంకితం చేసిన గిజుబాయి ,సుహోమ్లీన్స్కీ వంటి ఉపాధ్యాయులూ ,పిల్లల పెంపకం గురించి వ్రాసిన చలం వంటి తాత్వికులూ ,ఇంకా అనేక మంది దండన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్త పరిచారు .సమిష్టి బోధనా సిద్ధాంతాన్ని సోవియట్ రష్యాలో ఆచరించి చూపిన సుహోమ్లీన్స్కీ పిల్లల హృదయం ఎంత సున్నితమైనదో ఇలా చెబుతాడు.
                "పిల్లవాళ్ళు తేటగా ఉండే మనసులతో బాగా చదవాలనే మనః పూర్వకమైన కోరికతో బడికి వస్తారు.తమను సోమరులనీ మొద్దులనీ అనుకుంటారేమోననే ఆలోచనే వాళ్ళను బెదరగోట్టేస్తుంది.బాగా చదవాలనే ఆలోచన మంచిదే .పిల్లవాడి జీవితపు ఆలోచన మొత్తాల్లల సంతోష ప్రపంచాన్ని వెలిగించే కాంతి వంతమైన జ్యోతి అది .యీ జ్యోతి ఉపాధ్యాయుని దగ్గరకు అపరిమితమైన విశ్వాసం తో దుర్బలంగా రక్షణ లేకుండా వస్తుంది .ఆ ఉపాధ్యాయుడు పిల్లవాడి కోరికను గుర్తించక పోతే దానర్థం అతడు గానీ ఆమె గానీ భవిష్యత్ కాలాలపట్ల తగినంత గుర్తింపుతో లేరనే .పిల్లవాడి హృదయాన్ని అజాగ్రత్త స్పర్శ తో బాధపెట్టుకోవదానికీ ,నిర్లక్ష్యానికీ దారితీసే ఒక దూకుడు మాటతో ఆ జ్యోతిని తేలిగ్గా ఆర్పేయవచ్చు"
           పిల్లలకు అల్లరి చెయ్యాలని ఉండదు .పెద్ద వాళ్ళని ఏడిపిస్తే వాళ్ళకేమీ సంతోషం లేదు .కానీ వాళ్లకి ప్రవర్తించ వలసిన మార్గం తెలీక ,ఎట్లా తమ శక్తుల్నిఅభివృద్ధి పర్చుకోవాలో అర్థంకాక ,పెద్దవాళ్ళ  ఆజ్ఞలూ ఇబ్బందులూ స్పష్టంకాకనే " పిల్లలు అల్లరి చేస్తారని చెబుతాడు చలం .
                            ఇటువంటి పిల్లలను దండించడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో క్రూరులుగా తయారవుతారనీ,పిరికి తనం తో బ్రతుకుతారనీ చలం అభిప్రాయము .  జనవిజ్ఞాన వేదిక వంటి అభ్యుదయ సంస్థలు ,ప్రముఖ విద్యావేత్తలతో పాటుగా విద్యాలయాల్లోని దండన సంస్కృతికి వ్యతిరేకంగా తరగతి గదుల్లో ప్రజాస్వామ్యం గురించి పోరాడుతున్నాయి .2000 వ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రజతోత్సవ మహాసభల్లో ప్రవేశ పెట్టిన "విద్యారంగం యు.టి.యఫ్ వైఖరి "అనే డాకుమెంట్ లో ఇలా చెప్పారు .
                  "మన బోధనా ధోరణి ,ఒక వైపు మన ప్రమాణాలకే గాక మరోవైపు డ్రాపౌట్సుకు సైతం కారణం అవుతోంది .అంతేగాదు బడులలో పిల్లల భద్రత,బోధనలో ఆహ్లాదం అనేవి ప్రజాస్వామిక సంస్కృతి లక్షణాలు .అదొక మహత్తర విలువగల అంశం .దీనికి తగ్గ ప్రాధాన్యత లేక పోవడం మనవ్యవస్థ లోని పెద్ద బలహీనత .దీనిపై జరగాల్సినంత పరిశోధన గానీ ఇతరులనుంచి స్వీకరించే సాంప్రదాయం గానీ లేక పోవడం విచారకరం ."
                 ఇలా దండన తో కూడిన అశాస్త్రీయమైన పాత విద్యావిధానాన్ని మార్చుకోవాలని సూచించింది ఆ పత్రం .దీన్ని బట్టి ఉపాధ్యాయ సంఘాలు అందునా అభ్యుదయ భావజాలంతో ఉన్న సంఘాలు దండనకు వ్యతిరేకమని తెలుస్తోంది .1996 లో రూపొందిన 'కోడె ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫర్ టీచర్స్ "ఉపాధ్యాయుడు విద్యార్థులతో సంబంధం అనే విభాగం లో పాఠశాల  క్రమ శిక్షణ అమలు జరిపే సందర్భంలో విద్యార్థుల యొక్క ప్రాధమిక మైన మానవ హుందాతనాన్ని గౌరవించాలి అని పేర్కొంది .
                 పైన పేర్కొన్న విషయాలన్నీ శ్రైన్వీ ఆచరించదగినవీ అని అంగీకరిస్తూనే ఉపాధ్యాయుడిని  విద్యార్థిపై భౌతిక దండనకు పాల్పడే విధంగా నడిపించే కారణాలను సమూలంగా విశ్లేషించాల్సి ఉంది .దీనిలో భాగంగా మూడు కారణాలను గుర్తించవచ్చు . 1 ) ఉపాధ్యాయుని వైపు నుండి కారణాలు  2 )ప్రభుత్వ లేక వ్యవస్థాగత కారణాలు . ౩) సామాజిక కారణాలు . 
           ఉపాధ్యాయుని వైపు నుండి కారణాలు 
                  ఇతర కారణాలు ప్రస్తావించుకునేముందు ఉపాధ్యాయుని వైపు నుండి దండనకు కారణమయ్యే విషయాలను చర్చించుకోవడం సముచితంగా ఉంటుంది .అంతేగాక కొద్దిపాటి నిగ్రహం తోనూ ,శిక్షణ తోనూ ,వీటిని తేలిగ్గానే తొలగించుకోవచ్చు .
                  కొంతమంది ఉపాధ్యాయులు వ్యక్తిగతంగానే తీవ్ర అసహనాన్ని కలిగిఉంటారు.వీరు విద్యార్థుల పట్ల తేలికగా కోపానికి గురవుతారు .దండనకు పాల్పడతారు .కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను దండిచకపోతే విద్య క్రమశిక్షణ అభివృద్ది కావని భావిస్తారు .మరికొంతమంది ఉపాధ్యాయులు తమకుటుంబ సమస్యల ప్రభావాన్ని తరగతి గదిలోకి తీసుకు రావడం వల్ల అక్కడ జరిగే చిన్నచిన్న పొరపాట్లు కూడా వారి కోపానికి ఆజ్యం పోయడం ,కొంతమంది విద్యార్థులు దండనకు గురికావడం జరుగుతుంది .అసౌకర్యంగా తరగతి గడీ , పాఠశాల లోని ఇతర సమస్యలు కూడా ఉపాధ్యాయుని మనసు పై నెగటివ్ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది .విద్యార్థుల స్థాయి తక్కువగా ఉండటం ,లేక వారి అల్లరితో క్లాసు కొనసాగించలేక పోవడం కూడా ఉపాధ్యాయుడిని విద్యార్థిని దండించే వైపుకు లాగుతుంది .ఉపాధ్యాయుడి సంసిద్ధతా లోపం ,ప్లాను ప్రకారం తరగతిని కొనసాగించ లేకపోవడం కూడా దండనవైపుకు దారి తీయవచ్చు .
             ఇటీవలి కాలంలో ఉపాధ్యాయునికీ ,విద్యార్థికీ మధ్య చాలా బలహీనమైన సంబంధాలు ఉంటున్నాయి ."ఇప్పటిలాగా గంటల పరిమితి లేదు కాబట్టి ఉపాధ్యాయుడు ప్రతీ విద్యార్థిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి అతనికి  బోధన సాగిస్తూ అదనపు సమయం  పాఠశాలలో గడిపేవారు .ఇంకా వెనుక బడిన వారికి ట్యూషన్లో ప్రధానంగా బోధించేవారు .అందుచే ఉపాధ్యాయుల విద్యార్థుల సంబంధాలు బాగా ఉండేవి ,శిక్షలు ,బెత్తాలతో కొట్టడం కూడా ఎక్కువగానే ఉండేది .ఆ శిక్షలకు తల్లి ,దండ్రుల ఆమోదం కూడా ఉండేది." అంటూ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు గా పని చేసిన శ్రీ .డీ .రామి రెడ్డి తన జ్ఞాపకాలను తెలియజేస్తారు . ప్రస్తుతం ఉపాధ్యాయునికి విద్యార్థిపై తగినంత ప్రేమ ఉండక పోవడం ,విద్యార్థికి ఉపాధ్యాయునిపై తగినంత గౌరవం ఉండక పోవడంతో దండనకు సంబందించిన దుష్ఫలితాలు అనేక రెట్లు ఎక్కువగా కనబడుతున్నాయి .తను ఊహించినట్లు గానే విద్యార్థి ప్రవర్తించడనే గ్రహింపు ఉపాధ్యాయునికి లేక పోవడం ,విద్యార్ధి కుటుంబ నేపథ్యం పై ఉపాధ్యాయునికి అవగాహన లేకపోవడంతో పాటు భౌతిక దండన ద్వారానే విద్యార్థిని సులభంగా అదుపులో ఉంచవచ్చనే భావనకూడా దండనకు కారణమౌవుతోంది.ఇవన్నీ ఉపాధ్యాయుడు వ్యక్తిగతంగానో,శిక్షణ ద్వారానో ,ప్రత్యేక అధ్యయనం ద్వారానో ,శాసనాల ద్వారానో సరిచేసుకోగలుగుతారు .
               ప్రభుత్వ లేక వ్యవస్థాగత కారణాలు 
            పాఠశాలలో తగినన్ని గదులు లేకపోవడం వల్ల వివిధ క్లాసులకు చెందిన పిల్లలను ఒకే గదిలో కూర్చో బెట్టడం ,సెక్షన్ లను క్లబ్ చేయడం ,అనివార్యంగా విద్యార్థుల క్రమశిక్షణారాహిత్యానికి దారి తీస్తుంది .వేరే గత్యంతరం లేని ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రజాస్వామ్యానికి బదులు నియంతృత్వాన్ని ఆశ్రయిస్తాడు .తరగతుల్ని కొనసాగించడానికి సులభ మార్గమైన దండనను ఎంచుకుంటాడు.ఉపాధ్యాయుల కొరతా,ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి లో ఉండే తీవ్ర వ్యత్యాసాలు ఇవే ఫలితాన్ని ఇస్తాయి .కొంతమంది ప్రధానోపాధ్యాయుల అశాస్త్రీయ దృక్పథం కూడా కొన్ని సార్లు ఉపాధ్యాయునిచేత విద్యార్థులను దండిపజేస్తుంది .ఇంతే గాక ఫలితాలకోసం ఉపాధ్యాయులను  పరుగులు పెట్టించే పదకాలూ ,అధికార్లూ ఎంతకూ తరగని సిలబస్ ,జ్ఞాపకముంచుకోవడం మాత్రమే నేర్చుకోవడంగా భావించే పరీక్షా పద్దతీ ఉపాధ్యాయుడిని    దండనా యజ్ఞానికి ఆయత్తం చేస్తుంది .విద్యార్థిని బలిపశువును చేస్తుంది .  పాఠశాలలో ప్రశాంత వాతావరణం లేకపోవడం తో పాటు శాస్త్రీయ పద్ధతి లో విద్యను  బోధించేందుకు అనువైన సౌకర్యాలు అనేక  పాఠశాలలలో ఉండవు .వీటన్నిటినీ సరిచేయటానికి ఇసుమంతైనా ప్రయత్నం చేయకపోగా దండన అనేది కేవలం ఉపాధ్యాయుని పాపమే అన్నట్లుగా అతనికోసం శిక్షణా కార్యక్రమాలు నడుపుతారు ,శిక్షలను ఖరారు చేస్తారు .ఉపాధ్యాయుడిని దండనకు ప్రేరేపించే వ్యవస్థా గత కారణాలు చాలా తీవ్రమైనవీ ,ఉపాధ్యాయుడిని నిస్సహాయుడిని చేసేవీనూ .వాటిని సరిదిద్ది చిన్నారుల పై కరుణ చూపాల్సిన ప్రభుత్వం శిశు హింసను ప్రోత్సహించే దోషిగా మారుతోంది .
సామాజిక కారణాలు 
           మన పిల్లలను ఇంట్లోనూ , పాఠశాలలోనూ దండించడానికి మూలాలు మన సమాజంలోనే ఉన్నాయనడం అతిశయోక్తి కాదు .మన సమాజం భూస్వామ్య ,పెట్టుబడి దారీ వ్యవస్థల మిశ్రమం . ముఖ్యంగా కుటుంబ విషయానికి వస్తే ఇంకా భూస్వామ్య భావజాలమైన యాజమాన్య ఆధిపత్య ధోరణి ని వదిలించుకోలేదు ఇప్పటికీ బిడ్డను భవిష్యత్ పౌరునిగాకంటే స్వంత ఆస్తి గా భావించే లక్షణమే ఎక్కువ .తన ఆస్తికి  వారసుడిని తన అదుపాజ్ఞలలో ఉంచుకునే క్రమంలో కుటుంబం పిల్లలపై హింసను అధికంగానే ఉపయోగిస్తుంది ."మొక్కైవంగనిది మానై వంగుతుందా "అంటూ వారు శారీరకంగా ఎదగక బలహీనంగా ఉండే వయస్సులోనే ఈ హింస జరుగుతున్నట్లు మహిళా శిశు అభి వృద్ధి శాఖ విడుదల చేసిన రిపోర్ట్ తెలియజేస్తోంది.5 నుండి12 సంవత్సరాల పిల్లలే ఎక్కువ భౌతిక వేధింపులకు గురియగుచున్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో 63 .94 % పిల్లలపై భౌతిక వేధింపులు జరుగుతున్నాయి.ఈ నివేదిక ప్రకారం మొత్తం 47.15 % పిల్లలు దూషణలకు గురిఅవుతూంటే దానిలో తల్లుల వాటా 44.03% అనీ ,తండ్రుల వాటా 35.35% అనీ సహోదరులది 8.80 అనీ ఇతరులది 11.21%అనీ తేలుతోంది.ఇతరులహింసలో పెద్ద వాటా ఉపాధ్యాయులదే కావచ్చు.భార్యా భర్తల మధ్య సఖ్యత లేక పోతే పిల్లల పై హింస మరింత అధికమవుతుంది .
         మరో కోణం నుంచి చూస్తే పెట్టుబడి దారీ వ్యవస్థ కూడా హింసకు మద్ధతిచ్చేదే.ఈ వ్యవస్థ స్వభావం కూడా పాలకులు పాలితులుగానే వ్యక్తులను చూస్తుంది .క్రమశిక్షణా రాహిత్యానికి శిక్షలను నిర్దేశిస్తుంది.పాలితుల పట్ల ఈ దండన తీవ్రంగా ఉండేట్లు  జాగ్రత్త పడుతుంది. సమాజంలో ఉండే ఈ అంశాలు క్రమశిక్షణ కోసం విద్యాభివృద్ధి కోసం విద్యార్థిని భౌతికంగా దండించ వచ్చనే ధోరణికి మద్దతు నిస్తోంది . చాలా మంది ఉపాధ్యాయులకు గానీ ,సమాజంలో ఇతర వ్యక్తులకు గానీ ,దండనకు గురయ్యే విద్యార్థికి గానీ ఇందులో ఏమాత్రం పొరపాటు కనబడదు.ఇటువంటి సమాజంలో ఒకానొక భాగస్వామి అయిన  పాఠశాల,ఉపాధ్యాయుడూ ఆ దారినే అనుసరించడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు . ఇంత కథ దండనకుంటే  పలానా ఫోన్ నెంబరుకు డయల్ చేసి మిమ్మల్ని దూషించినా లేదా భౌతికంగా దండించినా ఉపాధ్యాయుడి పేరు చెప్పండి వెంటనే మేము అతడిని శిక్షిస్తాము అనే ప్రకటనల చాటున అసలు దోషులయిన ప్రభుత్వమూ సమాజమూ దాక్కోవాలని చూస్తున్నాయి . ఇదే సందర్భంలో ప్రాధమిక దశ నుండీ  పాఠశాలలలో ఉపాద్యాయులు మన;పూర్వకంగా దండనను నిషేదించాలి.ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి.ప్రజాస్వామ్యాన్ని తరగతి గదిలో వికసించేలా చూడాలి .తద్వారా ఆత్మగౌరవం ,దైర్యం ,సౌభాతృత్వం ,కలిగిన పౌరుల్ని సమాజానికి అందించాలి.సమాజంలో హింసను తగ్గించి ,నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి దేశాన్ని మళ్ళించే అవకాశం ఆ విధంగానే ఉంటుంది .అంతేగాక నిర్దోషి గా పోజు పెడుతున్న ప్రభుత్వాన్ని నిలదీసి అవసరమైతే పోరాడి విద్యార్థుల ఆహ్లాదకర బాల్యాన్ని నష్టపెడుతున్న వ్యవస్థాగత కారణాలను నిర్మూలించే ప్రయత్నం ఉపాధ్యాయులు తప్పక చేయాలి .మనం తప్ప ఈ విషయాన్ని ఎవరూ ఇంత లోతుగా పరిశీలించరు.ఎక్కడైనా పొరపాటు జరిగి వ్యవహారం శృతి మించితే మాత్రం మీడియా దాన్ని నాటకీయంగా వెలుగు లోకి తేవడం తో పాటు , అందరు ఉపాధ్యాయులూ అంతేననే వాతావరణం తేవడంలో ఏమాత్రం వెనుకాడదు.

27, సెప్టెంబర్ 2010, సోమవారం

              బుద్ధుడు నవ్వాడు

బుద్ధుడు నవ్వాడు
అసహజ సంకీర్ణ సంగీత విభావరిలో
బ్రహ్మచారికి ముదిమిలోనూ తప్పని
ముదితలపోరు చూసి
        బుద్ధుడు పకపకా నవ్వాడు
మౌడ్యానికి మారణాయుధాన్నందించిన
భారత రత్నాన్ని చూసీ
లీకేజీయే లేని ప్రోఖ్రాన్ పరీక్షలను చూసీ
                 బుద్ధుడు విస్మయంతో నవ్వాడు
హస్తిన పట్టాభి రాముడు భారతిని
అణు జ్వాలల్లో ప్రాయోపవేశం చేయమంటే
మాత కోకకు కూతల్తో నిప్పంటిస్తూన్న 
తోకలేని కోతుల్ని చూసి
               బుద్ధుడు బాధతో  నవ్వాడు
వికృత విస్పోటపు రవాలు
సద్దు మనుగుతూంటే
ఆకలి కేకలూ ....పాలందని పాపల ఏడుపూ
తీవ్ర మవడం చూసి 
              బుద్ధుడు జాలిగా నవ్వాడు 
వందిమాగధుల వందన సమర్పణ పై 
విజయం సాధిస్తున్న 
శాంతి కపోతాల సామర్థ్యాన్ని చూసి 
           బుద్ధుడు మనసారా నవ్వాడు .

ఈ కవితను ప్రోఖ్రాన్ అణు పరీక్షలు జరిపినప్పుడు రాసాను .బుద్ధుడు నవ్వాడు అనేది ఆనాడు ఉపయోగించిన కోడ్ .

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

                  నవ్య ఆర్ధిక విన్యాసం 
ప్రైవేటీకరణ 
సరళీకృత విధానాలు 
పిల్లలంతా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లు 
పెద్దలంతా డంకెల్  డంకెల్ సూపర్ స్టార్లు 
ఎరువులు కొరువులు
పంటలు అడవులు 
దేశమంతా కరువులు 
ఐ. ఎం .ఎఫ్ .అప్పులు 
మన్మోహన్ గొప్పలు 
సామాన్యుని తిప్పలు 
ద్రవ్యోల్బణం తగ్గింపు 
ధరల పెంపు 
పజిల్ అర్ధమయ్యేలోగా 
విదేశాలకు సంపదల తరలింపు 
గాట్ లూ పేటెంట్ లూ 
అందుకోలేని రేట్లూ 
పేషెంట్ల అగచాట్లూ 
పేదల తలలపై 
బహుళ జాతీయుల బూట్లు  
బంగారు కరచాలనాలూ 
దొడ్డి దారిన తోసేయటాలూ
బాధల బంది ఖానాలు 
కార్మికులతో నింపేయటాలూ
నిమ్మకుంటావా ?
ఇలాగే బాగుంది అంటావా ?
బాధపడతావా?
పరిష్కారం వెతుక్కుంటావా ?
ఆగ్రహిస్తావా ?
అడ్డుకుంటావా ?






Blog designed by Gopi varaprasad Rao,Cell:9247171248