Pages

22, సెప్టెంబర్ 2010, బుధవారం

                    భార్యా పరిణామం 
ప్రాచీన కాలం నుండి స్త్రీ పురుషునికి జంటగా ఉంటూ సమాజం తనకు నిర్దేశించిన కర్తవ్యాలను నిర్వహిస్తూ సమాజ పురోగమనంలో తనసగాన్ని తాను నేరవేరుస్తూనే ఉంది. సమాజంలో విప్లవాత్మక మార్పులు  సంభవించినప్పుడల్లా తన పాత్రను పునర్నిర్వచించు కుంటూనే ఉంది. మానవ జాతి నిరంతరాయంగా కొనసాగేందుకు ఆమే మూల కారణం అనేది నిర్వివాదాంశం. బిడ్డ పుట్టుకలో పురుషుడు కూడా కారణమే కదా అనవచ్చు. నిజమే కానీ పుట్టిన బిడ్డను సంరక్షించాల్సిన గురుతరమైన బాధ్యతను ప్రకృతి స్త్రీకే ప్రసాదించింది. దానికి సంబంధించిన సహజాతాలు స్త్రీలలో మాత్రమే ఉంటాయి. తండ్రులు చేసే ముద్దంతా బిడ్డ తనదని భావించడం వల్లనూ, వంశాంకురం అనుకోవడం వల్ల వచ్చే గర్వం వల్లనూ, బిడ్డతో ఏర్పడే స్నేహం వల్లనూ, బాధ్యత వల్లనే తప్ప మరొకటి కాదు .తండ్రి ఆపేక్ష సామాజికమైనదైతే తల్లికి అది ప్రాకృతిక బాధ్యత .ఆధునిక పరిశోధనలు కూడా తెల్చిందేమంటే పురుషుడు లేకపోయినా తన శరీరం లోని కణాల తోనే స్త్రీ బిడ్డను కనగలుగుతుందనీ , పురుషుడు ఆపని చేయ లేడనీ .ఇదిగో ఇదీ ఆమె గొప్పదనం .
      తల్లిగా జన్మనిచ్చినా, పురుషునికి జీవితాంతం స్ఫూర్తి రగిలిస్తూ ,జీవితంపై ఆశను రేకెత్తిస్తూ సుధీర్గ కాలం నడిచేది సహచరిగానే. స్త్రీని  ప్రాచీన కాలంలో పలానా గణానికి చెందిన అమ్మాయిగా గుర్తిస్తే, ఉమ్మడి కుటుంబాల కాలంలో పలానా వారి కోడలనీ,ఆధునిక న్యూక్లియర్ కుటుంబాలలో పలానా వ్యక్తి భార్యనీ గుర్తిస్తున్నారు .ఒక వ్యక్తికి ఒకే భార్యనే దంపతీ వివాహ పద్దతిలో ఈనాడు కొనసాగుతున్నాం .ప్రపంచం ఆధునికతను సంతరించుకున్నకొద్దీ భార్య స్థానంలో,స్థితి గతుల్లో,మార్పూ , అభివృద్ధీ వస్తూనేవుంది .అసలు ఫామిలీ (కుటుంబము )అనే మాట రోమన్ సంస్కృతి నుండి వచ్చింది. ఫాములస్ అంటే ఇంటి బానిస అని అర్థం .ఆ ఇంటికి యజమాని భర్త అయినప్పుడు ,ఆయన ఆధీనంలో భార్యా ,పిల్లలూ , బానిసలూ ఉండేవారు .
       దంపతీ వివాహం పుట్టుక ఫ్యూడల్ వ్యవస్థలో వ్యావసాయిక సంబంధాలకు అనుగుణంగా జరిగింది . ఈ దశలోనే ఇంటి నిర్వహణ స్త్రీకీ ,బయటి పనులన్నీ పురుషునికీ దఖలు పరచబడటమే కాక భార్యలైన స్త్రీలపై అనేక విధి నిషేదాలు కఠినంగా అమలుపర్చబడ్డాయి .బహుశా భార్యగా స్త్రీ అత్యంత గడ్డు  పరిస్థితుల్ని ఈ మధ్య యుగాల నాడే ఎదుర్కొన్నట్లున్నది .
ఆరకమైన ఆచార ఫలితాలే భర్త మరణిస్తే భార్య బ్రతికుండాల్సిన అవసరం లేదనేదాకా వెళ్ళాయి .
      ఇటీవలి కాలంలో మార్పులు వేగంగా వస్తున్నాయి .ప్రస్తుత ప్రపంచంలో పెరుగుతున్న విజ్ఞానం ,సాంకేతికత ,పరిశ్రమలు ,సంపద ,వినియోగ దృష్టీ .భార్యలను ఇంటిపని మాత్రమే చేసుకొనే స్థితిలో ఉంచడంలేదు .వారిని సామాజిక ఉత్పత్తి క్రమంలో ప్రత్యక్ష భాగస్వామిని చేస్తున్నాయి .ఈ జెంక్చర్లో స్త్రీ తన సర్వ శక్తులూ వికసించేలా ఎదగడమూ ,ఆమేరకు పురుషుడు ఒదగడమూ స్పష్టంగా తెలుస్తోంది ,ఇంకా కుటుంబం ఎలా మారనుందో అనే విషయం పై కుటుంబమూ ,వ్యక్తిగత ఆస్తి ,రాజ్యాంగాల పుట్టుక అనే గ్రంధంలోని ఈ వాక్యాలను చూడండి. 
          ఆధునిక కుటుంబంలో భార్య మీద భార్తకున్న ఆధిక్యతను రద్దు పరచాలన్నా ,వారిరువురి మధ్య సరిసమానమైన సాంఘిక సమానత్వం కల్పించాలన్నా పారిశ్రామిక రంగంలోనికి తీసుకు వచ్చినప్పుడే వారు నిజంగా స్వతంత్రులవుతారని దీనిని బట్టి బోధ పడుతుంది .ఇందుకు కుటుంబం సమాజానికి ఆర్ధిక యూనిట్ గా ఉండే స్థితిని రద్దు పరచాలి.
                         ప్రస్తుతం ఈ పరిస్థితి నిజమయ్యే స్థితి కనబడుతోంది . స్త్రీ పురుషులిద్దరూ సంపాదనా పరులవుతున్న ఈ దశలో కుటుంబం ఆర్ధిక యూనిట్ గా ఉండే స్థితి రద్దయి ,వ్యక్తే (స్త్రీ గాని పురుషుడు గాని )
ఆర్ధిక యూనిట్ గా ఉండే స్థితి రాబోతున్నది . వర్తమాన ప్రపంచం పెట్టుబడిదారీ విధానంలో నడుస్తున్నది .ప్రపంచంలో అన్నివ్యవస్థలూ మార్కెట్ ఆధీనం లోనే నడుస్తున్నాయి .ఏ మార్పైనా మార్కెట్ కను సన్నల్లోనే జరగాలి. లాభం ,నష్టం అనే రెండు అంశాలే మానవుల్నీ, మానవ సంబందాల్నీ, విలువల్నీ శాసిస్తున్నాయి.
కుటుంబాలూ , భార్యా భర్తల సంబంధాలు దానికి అతీతం కావు .అందుకే మళ్ళీ కుటుంబం లో భార్యా భర్తల సంబంధమూ ,భార్య పాత్రా ఒక్క కుదుపుతో మార్పుకు లోనుకాబోతోంది.ఇందులో ఒక మేలు  మరొక నష్టం స్పష్టంగా కనబడుతున్నాయి.సామాజిక ఉత్పత్తి లోకి స్త్రీ అడుగిడడం తప్పనిసరి కావడం,తద్వారా ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పొందడం ,పురుషాధిక్యతను ధిక్కరించడం. విసుగూ విరామం లేని ఇంటి చాకిరీ నుండి విముక్తి కావడం జరుగుతుంది . ప్రస్తుతం నినాదంగా ఉన్న నాలెడ్జ్ సొసైటీ లో యాభై శాతం వాటా ఆమె తేలిగ్గానే క్లెయిం చేస్తుంది .ఇవన్నీ మహిళలను ఉన్నతికి చేర్చే  అంశాలే. మార్కెట్ ,పెట్టుబడి , స్వంత ఆస్తి ,కెరీర్ మొదలైన పదాలు రాజ్యం ఏలే తరుణంలో కుటుంబ సంబంధాలు బలహీనం కావడం మొదలవుతుంది .భార్యా భర్తల మధ్య మానవీయ స్నేహ సంబంధాలు పెంచాల్సిన స్త్రీ స్వేచ్చ మళ్ళీ పూర్తిగా ఆర్ధిక సంబంధంగా మారుస్తోందేమోనని భయం కలుగుతుంది. ఎందుకంటే , సమానత్వం , స్త్రీ పురుషులు లేదా భార్యా భర్తల మధ్య సంబంధాన్ని ఎవరి ఆధిపత్యం లేని సహజ స్నేహ బంధంగా మార్చాల్సి ఉండగా , పెద్ద పెద్ద కంపెనీల స్వార్ధపూరిత దోపిడీ ,కళ్ళు చెదిరే వినియోగ తత్వం ,సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యతలేని ఆర్ధిక వ్యవస్థ భార్యా భర్తల మధ్య అవాంచనీయ పరిస్థితులనే సృష్టిస్తుందనేది నా విశ్వాసం .ప్రేమా,స్నేహం ,స్థానే లాభం ,నష్టం అనే సూత్రాలతో భార్యా భర్తలు కలవవడం,విడిపోవడం జరుగవచ్చు. ఇండియా టుడే పత్రికలో ప్రకటించిన సర్వే ప్రకారం సుమారు నలభై ఏడు శాతం వర్కింగ్ ఉమెన్ కుటుంబ జీవనం కంటే వృత్తికే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియజేసింది .
        భార్యా భర్తల సంబంధాలు పూర్తి సహజంగా,సమానత్వంతోటీ ,స్నేహ సౌరభాలతోటీ గుభాళించాలంటే ఆస్తుల, ఆర్ధిక వ్యవస్థల సంకెళ్ళ నుండి విదివదాల్సి ఉంది.సమాజంలో ఇతర ఆర్ధిక అంతరాలు నశించే దాకా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి.ఇదొక పొలిటికల్ స్టేట్మెంట్ లా ఉన్నా ఇది నిజం .స్త్రీ, పురుష సమానత్వం ఉండే ఆ అద్భుత ప్రపంచం కోసం ఎదురు చూద్దాం.
       అనేక కుటుంబాలలో వివాహంతో ఏర్పడిన భార్యా భర్తల సంబంధాలు ఎంత ఉన్నతమైనవని చెప్పు కున్నా కొంతకాలానికి నిరాసక్తంగా మారి పోతున్నాయి .ఇది చేదు నిజం.ఎవరిపని వారికే అన్నట్లు యాంత్రికంగా తయారవుతున్నాయి. ఆయన బయట పని చేసి రావడం ,ఈవిడ ఇంటి  చాకిరితో సతమతం కావడం.ఇరువురూ మాట్లాడుకునే విషయాలు సాధారణంగా ఆర్ధిక విషయాలు ,పిల్లల చదువులు,పెద్దల బాధ్యతలు, వంటివే తప్ప ఒకరి పట్ల ఒకరికి ఆసక్తిని పెంచే అంశాలు లేకపోవడం పెద్ద లోటుగా ఉంటోంది. ఇరువురికీ ఉమ్మడిగా ఉండే ఆసక్తుల మీద చర్చించు కోవడం లోనూ ,విడిగా ఉండే అభిరుచుల్ని ప్రోత్సహించుకునే విషయంలో వెనుకబడటం ఈ యాంత్రిక జీవనంలో పరిపాటి అయ్యింది.ప్రేమించి వివాహబంధంలోనికి అడుగు పెట్టిన జంటలూ దీనికి మినహాయింపు కాదు. ప్రేమించు కునేతప్పుడూ ,లేదా పెళ్ళయిన కొత్తలోనూ స్వతంత్ర వ్యక్తిలా కనపడిన అమ్మాయి దగ్గరనుండి భర్తగా తన హక్కుల్ని తాను తీసుకుని ఆవిడకేమో బాధ్యతలు అప్పజెపుతాడు.సమానత్వం లోనించి అసమానత్వంలోకి ఇద్దరూ ఒక గెంతు వేస్తారు.ఈ అసమానత్వం ఒకరి పట్ల మరొకరికి విముఖతను కల్గిస్తుంది.భార్యకు ఆ బంధం బానిసత్వంలా తోస్తే భర్తకు గుదిబండలా తోస్తుంది .
          దీనికి విరుగుదేమిటి ? భార్యా భర్తలు పరిపూర్ణ వ్యక్తులుగా మారాలి .ఒకరిపట్ల మరొకరికి ప్రేమ ,దాంతోపాటు గౌరవం ఉండాలి .ఉమ్మడి ఆసక్తులు పెంచుకోవాలి .ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవిచాలి .ఒకరిపై ఒకరు స్నేహం కోసం ,ప్రేమ కోసం ,కుటుంబ బాధ్యతల నిర్వహణ కోసం ఆధారపడాలి తప్ప ఆర్ధికాంశాల కొరకు కాకూడదు .అంటే భౌతిక సాహచర్యం కంటే ఎక్కువగా బౌద్ధిక సాహచర్యం ఉండాలి .అప్పుడా దాంపత్యం ,స్నేహం జీవితాంతం కొనసాగుతుంది.సమానత్వంతో ఉండే దాంపత్యంలో పురుషునికి గతం నుండీ వచ్చే అనేక సౌకర్యాలు రద్దయినా,స్వతంత్ర వ్యక్తిత్వంతోనూ ,సమాజంతో సజీవ సంబంధంతోనూ ఉండే స్త్రీ భార్యగా పురుషునికి స్పూర్తినివ్వడంలోనూ,తను స్పూర్తిని పొందడంలోనూ విజయం సాధిస్తుంది.స్త్రీని వంట గది లోనే బందీ చేస్తే ఆ వంటిల్లు పురుషుదినీ లాగుతుంది.అమర్త్యసేన్ స్త్రీ ,పురుష అసమానతలు బహుముఖత్వం అనే పుస్తకంలో ఇలా అంటాడు ."స్త్రీలతో పోలిస్తే పురుషులలో హృదయకోశ వ్యాధులు ఎక్కువ .అంటే మరో భాషలో చెప్పాలంటే ,స్తీల మనోభావాలనూ,ఇష్టాయిష్టాలనూ నిర్లక్ష్యం చేయడానికి ఫలితం,రెట్టింపు ప్రతీకారంతో పురుషుని ఆరోగ్యం మీద హృదయ కోశ వ్యాధుల రూపంలో వ్యక్తం అవుతున్నది."
           ఆమెకు ఆనందం కలిగించే విషయాలు కుటుంబ చాకిరీలో అణగారి పోయినట్లే ,పురుషుడికీ తన ఆసక్తులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండదు .తిరస్కారమే ఎదురవుతుంది . ఒకవేళ ఆ ప్రయత్నం తీవ్రంగా చేసినా కుటుంబ సంబంధాల్లో ఘర్షణ మొదలవుతుంది.తొలి దశలో అణచి వేత కార్యక్రమం ,మాలి దశలో సర్దుకు పోవడం ,చివరి దశలో విడిపోవడం వరకూ ప్రస్థానం కొనసాగుతుంది .ఇది వ్యక్తులకూ సమాజానికీ కూడా నష్టమే మంచి కళాకారుడూ ,కవీ రచయితా ,గాయకుడూ ఇలా విరమించుకుంటే ఈ ప్రపంచం చాలా కోల్పోతుంది .అఒన్థె గాక తనతో పాటు మరొక స్త్రీని కేవలం మనిషిగానే తప్ప మనీషిగా ఎదగ నీయడు అలాంటి పురుషుడు .అలా ప్రతిభావంతులైన సగం మంది వంట గదుల్లో మిగిలి పోతే దేశానికి చాలా నష్టం .అప్పుడు సగం మంది పనిచేసినట్లూ, సగం మంది (స్త్రీలు ) వారికి సేవ చేసినట్లూ ఉంటుంది తప్ప భూమ్మీద పుట్టిన ప్రతీ వ్యక్తినీ సామాజికోత్పత్తి లో భాగస్వామిని చేసినట్లు కాదు .అందరూ సమాజం లో ఉత్పాదక శ్రమలో పాల్గొంటే ఇప్పటికంటే రెట్టింపు వేగంతో సమాజంలో ఆర్ధికాభివృద్ధి జరుగుతుంది. సమాజంలో సంపద,సుఖాలు పెరుగుతాయి .భార్యా భర్తల బంధం అశాంతులకు లోనుకాకుండా నడుస్తుంది .
       ఇప్పటివరకూ మన సూత్రీకరణలు మధ్య తరగతి పై తరగతి వర్గాలకు చెందిన కుటుంబాలకే ఎక్కువగా వర్తిస్తాయి .సమానంగా పనిచేస్తూ కేవలం ఆర్ధిక ఇబ్బందుల వల్ల కుటుంబ జీవనంలో ఏమాత్రం ఆనందం అనుభవించలేని స్థితి కాయకష్టం చేసుకునే శ్రామిక కుటుంబాలలో చూస్తాం.దీనికి కారణం శ్రామికులు నిరంతరం ఆర్ధిక దోపిడీకి గురికావడమే దోపిడీ నుండి ఏమేరకు శ్రామికులు విముక్తం అయితే  ఆమేరకు వారి కుటుంబాల్లో ఆనందం వేల్లువిరుస్తుంది ఇది  దోపిడీ రహిత సమాజం లోనే సాధ్యం ఆసమాజం కోసం మానవులు కృషి చెయ్యకుండా ఆనందకరమైన కుటుంబ జీవనం , భార్యా భర్తల  సంభందాలు సాధ్యం కావు .
                                                   సమాప్తం 
  ఈ వ్యాసం మస్తర్జీ అకాడమి భద్రాచలం వారిచే ముద్రించ బడిన 'భార్య ' అనే కవితా సంకలనం కోసం వ్రాసాను . దాని లోనుండి కొంత భాగాన్ని ఇక్కడ పోస్ట్ చేసాను.చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ....  

1 కామెంట్‌: